వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు!

హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయన విచారణకు రావాలని మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.

Published on: Nov 9, 2026, 20:41:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU)లో తీవ్ర కలకలం రేగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్డాస్ జానయ్యపై ఒక మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

వీసీకి నోటీసులు
వీసీకి నోటీసులు

పీజేటీఏయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముసిని తేజశ్రీ ఆరోపణలు చేశారు. వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య తనను లైంగికంగా వేధించడంతో పాటు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు నవంబర్ 7న ఆమె మహిళా కమిషన్‌కు అధికారికంగా పిటిషన్ సమర్పించారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్, విచారణ నిమిత్తం వర్సిటీ వీసీకి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 12న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి, వీసీ అల్డాస్ జానయ్యకు సమన్లు పంపించింది.

నవంబర్ 12న హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ ముందు వీసీ స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎలాంటి మినహాయింపు లేకుండా విచారణకు విధిగా హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది. ఈ విచారణకు సంబంధించిన నోటీసు ప్రతిని ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ముసిని తేజశ్రీకి కూడా పంపి, విచారణ తేదీ వివరాలను తెలియజేశారు.

నవంబర్ 12న జరగబోయే విచారణలో ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలపై వీసీ అల్డాస్ జానయ్య ఇచ్చే వివరణను మహిళా కమిషన్ రికార్డు చేయనుంది. ఇరు వర్గాల వాదనలు, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం తదుపరి చట్టపరమైన లేదా పరిపాలనాపరమైన చర్యలపై మహిళా కమిషన్ తుది నిర్ణయం తీసుకోనుంది. విద్యాసంస్థల్లో ఉన్నత స్థానంలో ఉన్న అధికారిపైనే ఈ తరహా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More