రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!

న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Published on: Nov 9, 2026, 18:25:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ంనఉన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కలెక్టర్‌కు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత ధర్మాసనంలో అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్‌కు చట్టబద్ధమైన సమయం ఇస్తూ శిక్ష అమలును 4 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-A ప్రకారం నిషేధిత భూముల జాబితా నుంచి తమకు చెందిన కొన్ని ప్లాట్లను తొలగించాలని కోరుతూ బాధితులు గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. అయితే కలెక్టర్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.

బాధితుల వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, 60 రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు 2025 ఆగస్టులో జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కోర్టు విధించిన 60 రోజుల పరిమితి ముగిసినప్పటికీ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

న్యాయస్థానం ఆదేశాలను పాటించకపోవడంతో బాధితులు 2025 అక్టోబర్ 15న హైకోర్టులో కలెక్టర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 26 ఫిబ్రవరి 2026 ధిక్కరణ పిటిషన్ పడిన తర్వాత అధికారులు కదిలారు. బాధితుల వినతి తిరస్కరించారు. 08 జులై 2026 ప్లాట్ల తొలగింపు వినతిని రెండోసారి తిరస్కరిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు.

కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే జిల్లా యంత్రాంగం స్పందించడంపై జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్ నమోదయ్యాక హడావుడిగా నోటీసులు ఇవ్వడం, 2026 ఫిబ్రవరి 26న వినతిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం, ఆ తర్వాత జులై 8న మరోసారి తిరస్కరణ నోటీసు ఇవ్వడం ప్రక్రియను నామమాత్రంగా చుట్టేయడమేనని తప్పుబట్టింది.

'ఐఏఎస్ స్థాయి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను చులకనగా చూడటం లేదా నిర్లక్ష్యం చేయడం సమాజానికి తప్పుడు సంకేతం ఇస్తుంది. కోర్టు గడువులోగా స్పందించకుండా, పిటిషన్ వేసిన తర్వాత నామమాత్రపు ఉత్తర్వులతో ఉల్లంఘనను సరిదిద్దుకోలేరు.' అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.

న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కాలయాపన చేయకుండా నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సిందేనని, నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి ఉన్నతాధికారులైనా చట్టానికి జవాబుదారీ కాక తప్పదని ఈ తీర్పు పునరుద్ఘాటించింది. అయితే కలెక్టర్ అప్పీలుకు వెళ్లేందుకు 4 వారాల వ్యవధి ఉండటంతో, డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది ఆసక్తికరంగా మారింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More