తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ పాఠాలు.. ఫ్రీ ల్యాప్‌టాప్‌లు, 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి!

తెలంగాణ విద్యాశాఖ, అమెజాన్ సంస్థల కీలక ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల సిలబస్‌లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విద్యను అందించనుంది. ఏడాదికి 10 లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉపయోగరకంగా ఉండనుంది.

Published on: Jul 1, 2026, 13:11:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఒక కీలక అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విద్యను చేర్చేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య
ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య

అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్’ (AFE) కార్యక్రమంలో భాగంగా ఈ సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ ఏఐ పాఠాలను బోధిస్తారు. ఇంత పెద్ద ఎత్తున పాఠశాల స్థాయిలోనే ఏఐ విద్యను సిలబస్‌లో చేర్చిన దేశంలోని తొలి రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది.

ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(SCERT) ప్రత్యేకంగా సిలబస్‌ను సిద్ధం చేసింది. దీనికి ‘పై జామ్ ఫౌండేషన్’ (Pi Jam Foundation) అనే సంస్థ కంటెంట్, మేనేజ్‌మెంట్ పరంగా సహాయం అందిస్తోంది. ఈ సంస్థకు చెందిన కోడ్‌మిత్ర ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా విద్యార్థులు ఈ పాఠాలను నేర్చుకుంటారు.

ప్రతి విద్యార్థికి ఏడాదికి 25 గంటల పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఏఐ క్లాసులు ఉంటాయి. కంప్యూటేషనల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ సిస్టమ్స్ (నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలు), నిత్యజీవితంలో ఏఐ అప్లికేషన్ల వాడకం గురించి నేర్పుతారు. దీనివల్ల విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు పెరుగుతాయి.

ఈ ఏఐ పాఠాలను విద్యార్థులకు సమర్థవంతంగా బోధించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 28,000 మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. అలాగే క్లాస్‌రూమ్ మౌలిక వసతులను కూడా మెరుగుపరిచింది. డిజిటల్ విద్యావ్యాప్తిని మరింత పెంచేందుకు గానూ అమెజాన్ సంస్థ రాష్ట్రంలోని 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVలు), 152 కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE) పాఠశాలలకు 2,000 కంటే ఎక్కువ రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లను ఉచితంగా అందించనుంది. వీటితో పాటు అమెజాన్ ఉద్యోగులు స్వచ్ఛందంగా విద్యార్థులకు మెంటర్‌షిప్, కెరీర్ గైడెన్స్, టెక్నాలజీ రంగంలో అవకాశాలపై అవగాహన కల్పిస్తారు.

ఈ భాగస్వామ్యం వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కేవలం సాంకేతికతను వాడటమే కాకుండా, నిత్యజీవిత సమస్యలను పరిష్కరించడానికి ఏఐని ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకుంటారని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా చెప్పారు.

వెనకబడిన వర్గాల విద్యార్థులకు కూడా ఏఐ విద్యను అందుబాటులోకి తేవాలనే తన నిబద్ధతకు ఈ ఒప్పందం ఒక నిదర్శనమని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ అన్నారు. 2030 నాటికి భారతదేశ వ్యాప్తంగా 40 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని చేర్చడమే లక్ష్యమన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More