హైదరాబాద్‌లో తగ్గిన గాలి కాలుష్యం.. నల్గొండలో మాత్రం పెరుగుదల

హైదరాబాద్‌లో గాలి కాలుష్యం తగ్గింది. అదే సమయంలో నల్గొండలో మాత్రం పెరుగుదల కనిపించింది. తెలంగాణలో వాయు కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటున్నా.. ఫలితాల్లో తేడా ఉంటుంది.

Published on: Oct 8, 2026, 07:22:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాజధాని హైదరాబాద్, సమీప పారిశ్రామిక ప్రాంతమైన సంగారెడ్డి ప్రజలకు సంతోషకరమైన వార్త. గత కొన్నేళ్లుగా ఆందోళన కలిగిస్తున్న గాలి కాలుష్యం హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తగ్గింది. అయితే నల్గొండ జిల్లాలో మాత్రం గాలిలో ధూళి కణాల సాంద్రత కొంత పెరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్‌లో తగ్గిన గాలి కాలుష్యం
హైదరాబాద్‌లో తగ్గిన గాలి కాలుష్యం

ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ (AQMC) చైర్మన్, అటవీ-పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మౌలిక మండలి (TGPCB) మెంబర్ సెక్రటరీ రవితో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

గాలిలోని అతిసన్నని ధూళి కణాల(PM10) ప్రమాణాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. హైదరాబాద్ 2019–20 సంవత్సరంలో ప్రతి క్యూబిక్ మీటరు గాలిలో సగటున 86 మైక్రోగ్రాములుగా ఉన్న పిఎమ్10 (PM10) స్థాయి, 2025–26 నాటికి 80 మైక్రోగ్రాములకు తగ్గింది.

సంగారెడ్డిలో కాలుష్యం మరింత తగ్గింది. గతంలో 87 మైక్రోగ్రాములుగా ఉన్న PM10 స్థాయి, ఇప్పుడు 78 మైక్రోగ్రాములకు పడిపోయింది. నల్గొండలో కాలుష్యం పెరిగింది. గతంలో 59 మైక్రోగ్రాములు ఉన్న PM10 స్థాయి ప్రస్తుతం 71 మైక్రోగ్రాములకు చేరింది.

ఈ మూడూ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI - గాలి నాణ్యత సూచీ) ప్రస్తుతం తృప్తికరం నుండి సాధారణం వర్గాల్లోనే ఉందని కమిటీ స్పష్టం చేసింది.

CURE పరిధిలో గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా పరిశీలించడానికి 13 నిరంతర పరిసర గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం కచ్చితమైన ప్రాంతాలను ఎంపిక చేసేందుకు ఒక నిపుణుల కమిటీని కూడా నియమించారు. బొల్లారం, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల్లో ఇప్పటికే 8 తక్కువ ఖర్చుతో కూడిన సెన్సార్లను అమర్చారు. త్వరలోనే రీసైక్లింగ్ యూనిట్లు, క్రషింగ్ సెంటర్లు, భవన నిర్మాణ, వ్యర్థాల కేంద్రాల వద్ద వీటిని మరిన్నింటిని ఏర్పాటు చేయనున్నారు.

నగరాల్లో గాలి కాలుష్యానికి ప్రధాన కారణం రోడ్లపై ఉండే ధూళి అని గుర్తించారు. దీని నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. రోడ్లను శుభ్రం చేయడానికి యంత్రాల వాడకం. దీనికోసం దాదాపు 100 మంది పురపాలక అధికారులకు ప్రత్యేక వర్క్‌షాప్ కూడా నిర్వహించారు.

ట్రాఫిక్ కారిడార్ల వెంట మొక్కలు నాటడం, చిన్న అడవుల పెంపకం, మియావాకి పద్ధతిలో దట్టమైన చెట్లను పెంచడంలాంటి ప్లాన్స్ ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్ల అనుసంధానంతో ధూళి ఎగరకుండా చేయాలి. వాహనాల నుండి వచ్చే పొగ వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టేందుకు రవాణా శాఖ సరికొత్త సాంకేతికతను తీసుకొస్తోంది. ఎక్స్‌పైర్డ్ పియూసిపై ఆటోమేటిక్ చలాన్లు తీసుకురానుంది. గడువు ముగిసిన వాహనాలను గుర్తించేందుకు ANPR (Automatic Number Plate Recognition) కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు ఆటోమేటిక్‌గా ఈ-చలాన్లు పడతాయి.

జీహెచ్ఎమ్‌సీ పరిధిలో ప్రస్తుతం 310 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, పిఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరిన్ని ఈ-బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నారు. నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో కాలుష్యానికి ప్రధాన కారణాలను లోతుగా అధ్యయనం చేసి, తగిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక పరిశోధనలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More