ఆంధ్రప్రదేశ్‌లో లక్ష కోట్లతో బీపీసీఎల్‌ భారీ ప్రాజెక్ట్‌.. కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్‌సిగ్నల్!

ఏపీలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి పచ్చ జెండా ఊపింది. రూ.1 లక్ష కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు కానుంది.

Published on: Oct 4, 2026, 21:47:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పారిశ్రామిక పెట్టుబడికి బాటలు సుగమమయ్యాయి. నెల్లూరు జిల్లాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఏర్పాటు చేయబోతున్న భారీ 'గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్' ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బీపీసీఎల్
బీపీసీఎల్

సుమారు రూ.1,03,408 కోట్ల భారీ వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, రామాయపట్నం పోర్టు సమీపంలో నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. దేశంలోనే మూడో అతిపెద్ద ఇంధన శుద్ధి సంస్థ అయిన బీపీసీఎల్, నెల్లూరులో దాదాపు 5,200 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనాలు, రామాయపట్నం పోర్టుతో అనుసంధానించిన మెరైన్ క్రూడ్ ఆయిల్ టెర్మినల్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో 14,000 మందికి (400 ప్రత్యక్ష, 13,600 పరోక్ష) ఉపాధి లభిస్తుంది. కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక 5,000 మందికి (1,250 ప్రత్యక్ష, 3,750 పరోక్ష) ఉద్యోగాలు లభిస్తాయి.

పర్యావరణ సమతుల్యత కోసం కంపెనీ కేటాయించిన 5,200 ఎకరాల్లో 30 శాతానికి పైగా, అంటే 1,563 ఎకరాల్లో పచ్చదనం (గ్రీన్ బెల్ట్) ను అభివృద్ధి చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక కోసం రూ.3,022 కోట్లు, పరిసర గ్రామాల అభివృద్ధి, సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం మరో రూ.54 కోట్లను బీపీసీఎల్ కేటాయించింది. నిర్మాణ స్థలానికి 10 కిలోమీటర్ల పరిధిలో నేషనల్ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలు లేవని సంస్థ స్పష్టం చేసింది.

పారిశ్రామిక అవసరాలకు రోజుకు 2.25 లక్షల క్యూబిక్ మీటర్ల మంచి నీరు అవసరం కాగా, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే 'డీసాలినేషన్ ప్లాంట్' ద్వారా ఈ నీటిని సమకూర్చుకుంటారు. దీనికోసం రోజుకు 6.24 లక్షల క్యూబిక్ మీటర్ల సముద్రపు నీటిని డ్రా చేస్తారు.

ఈ ప్రాజెక్టుకు మొత్తం 770 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా అందులో 185 మెగావాట్లను సొంత క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ద్వారా, మిగిలిన 585 మెగావాట్లను రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ ద్వారా పొందుతారు. ప్రస్తుతం బీపీసీఎల్ సంస్థ ముంబై, కొచ్చి, బినా (మధ్యప్రదేశ్)లలో రిఫైనరీలను నడుపుతోంది. వీటి సంయుక్త శుద్ధి సామర్థ్యం 35.3 మిలియన్ టన్నులుగా ఉంది.

సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా మొత్తం రూ.1.7 లక్షల కోట్ల కాపెక్స్ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందులో శుద్ధి, పెట్రోకెమికల్స్ విభాగానికి కేటాయించిన రూ.75,000 కోట్లలో భాగమే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు అయ్యే భూసేకరణ, అధ్యయన వ్యయం (రూ.6,000 కోట్లు).

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More