తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. 30 రోజుల్లో ఫోన్ నెంబర్, ఈమెయిల్ అప్‌డేట్ చేయాలి

తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ షాక్ ఇచ్చింది. రూ.1,930 కోట్ల ట్రాఫిక్ చలానాలు పెండింగ్‌లో ఉండటంతో.. వాట్సాప్, ఎస్ఎంఎస్ చలానాలను అధికారికం చేస్తూ జీవో 25 జారీ చేసింది. 30 రోజుల్లోగా వాహన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం తప్పనిసరి.

Published on: Jun 3, 2026, 09:19:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై పోలీస్, రవాణా శాఖలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలానాల రూపంలో వాహనదారులు ప్రభుత్వానికి దాదాపు రూ.1,930 కోట్లు బకాయి పడ్డారు. జూన్ 1 నాటికి పోలీస్ శాఖ విధించిన చలానాల సంఖ్య 5,34,53,337కు చేరగా.. వీటి మొత్తం విలువ రూ.19,26,08,22,750 గా ఉంది. రవాణా శాఖ రికార్డు చేసిన ఉల్లంఘనల పెండింగ్ జరిమానాలు రూ.3.07 కోట్లుగా ఉన్నాయి.

వాహనదారులకు అలర్ట్
వాహనదారులకు అలర్ట్

వాహనదారులకు ఎస్ఎంఎస్, వాట్సాప్, లేదా ఈమెయిల్ ద్వారా పంపే ట్రాఫిక్ చలానాల సమాచారాన్ని అధికారిక కమ్యూనికేషన్‌గా గుర్తిస్తూ రవాణా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందేశం అందిన వెంటనే వాహనదారుడికి సమాచారం చేరినట్లుగానే భావిస్తారు.

రవాణా శాఖ జూన్ 1న జారీ చేసిన జీవో నెం. 25 ప్రకారం.. వాహనదారులందరూ తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని 30 రోజుల్లోగా 'వాహన్' పోర్టల్ (http://vahan.parivahan.gov.in) లో తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలి. ఈ గడువు ముగిసిన తర్వాత, వాహన్ పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్‌కు ఎస్ఎంఎస్, వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా పంపే ఏ చలానైనా వాహనదారుడికి చేరినట్లుగానే పరిగణిస్తామని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

వాహనదారులందరూ తమ కాంటాక్ట్ వివరాలను వాహన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం ఇకపై విధిగా మారుతుంది. వచ్చే నెల నుండి ఇది ఒక ఏకీకృత ట్రాకింగ్ సిస్టమ్ (Unified Tracking System) లా పనిచేస్తుంది. చలానాను పోలీసులు జారీ చేసినా, లేదా రవాణా శాఖ జారీ చేసినా ప్రక్రియ మొత్తం సులభతరం అవుతుంది. వాహనదారుడికి మెసేజ్ వెళ్లిన వెంటనే, సదరు వ్యక్తికి సమాచారం అందిందని, దాన్ని వారు అర్థం చేసుకున్నారని, జరిమానా చెల్లించడానికి కట్టుబడి ఉన్నారని భావిస్తారు.

తాజా ఉత్తర్వులతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చలానాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపే విధానం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇకపై డిజిటల్ రూపంలో వచ్చే చలానాలే అధికారికం కానున్నాయి.

తమకు వచ్చిన చలానాలపై ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే, వాహనదారులు సంబంధిత 'రెడ్రెస్సల్ అథారిటీ'ని సంప్రదించవచ్చని ప్రభుత్వం మరో జీవోలో పేర్కొంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, పరిసర మునిసిపాలిటీలు, ప్రతిపాదిత 'ఫ్యూచర్ సిటీ' కమిషనరేట్ పరిధిలో ఆయా ప్రాంతాల ట్రాఫిక్ డీసీపీలు పరిష్కార అధికారులుగా వ్యవహరిస్తారు.

మిగిలిన జిల్లాల్లో అడిషనల్ ఎస్పీ ఈ బాధ్యతలు చూస్తారు. ములుగు, నారాయణపేట జిల్లాల్లో మాత్రం నేరుగా జిల్లా ఎస్పీ ఈ ఫిర్యాదులను పర్యవేక్షిస్తారు. వాహనదారులు వెంటనే అప్రమత్తమై తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవడంతో పాటు, పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More