TG School Breakfast Scheme : ప్రభుత్వ బడి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ - డిసెంబర్ 9న సెంట్రలైజ్డ్‌ కిచెన్లు ప్రారంభం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన ఉదయం ఉపహారం (బ్రేక్‌ఫాస్ట్) అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఆధునిక కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సీఎస్ఆర్ నిధులు సమకూరాయి.

Published on: Oct 3, 2026, 09:46:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు రోజూ ఉదయమే పోషకాలతో కూడిన టిఫిన్ అందించే బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు రెండు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఈ సంస్థలు కీలక అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకున్నాయి.

డిసెంబరు 9న సెంట్రలైజ్డ్‌ కిచెన్లు ప్రారంభం
డిసెంబరు 9న సెంట్రలైజ్డ్‌ కిచెన్లు ప్రారంభం

నాగర్‌కర్నూల్‌లో నిర్మించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం 'జున్నా సోలార్ సిస్టమ్స్' సంస్థ రూ. 5.17 కోట్ల భారీ చెక్కును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు అందించింది. ఈ కార్యక్రమంలో జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈఓ అనిల్ బాబు పాల్గొన్నారు.

అలాగే…. వికారాబాద్ జిల్లాలో అధునాతన కిచెన్ నిర్మాణం కోసం 'చైన్ ల్యాబ్స్ ఇండియా' సంస్థ రూ. 4 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేసింది. చైన్ ల్యాబ్స్ ప్రతినిధి డి. సుమంత్, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ ఈ మొత్తాన్ని సీఎం సమక్షంలో ఫౌండేషన్ బోర్డుకు అప్పగించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ముందుకు వచ్చిన ఈ కంపెనీల యాజమాన్యాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

డిసెంబర్ 9 నాటికి రాష్ట్రవ్యాప్తంగా….

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వచ్చే నవంబర్ 30వ తేదీ నాటికే అన్ని సెంట్రల్ కిచెన్ల నిర్మాణం, పరికరాల అమరిక పూర్తి కావాలని స్పష్టం చేశారు. డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రీకృత వంటశాలలను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కిచెన్లలో ఆహారం ఏ విధంగా తయారవుతోందో విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించేలా పర్యటనలు ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారు.

  • హెల్త్ - అకాడమిక్ ట్రాకింగ్ : ప్రభుత్వ పాఠశాలల పిల్లల శారీరక ఎదుగుదల, బరువు, విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు సమగ్రంగా నమోదు చేయాలి.
  • యాప్‌ ద్వారా క్యాలరీల లెక్కింపు : విద్యార్థులకు ఇచ్చే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎంతవరకు పోషకాలు, క్యాలరీలు అందుతున్నాయో సరిచూడటానికి ప్రత్యేక డిజిటల్ యాప్‌లను ఉపయోగించాలి.
  • స్థానిక రుచులు - ప్రత్యేక మెనూ : తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ మెనూ రూపొందించాలి.
  • కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం : ఈ పథకం నిరంతరం, సుదీర్ఘకాలం సాగేలా చూసేందుకు కిచెన్ల పర్యవేక్షణను నేరుగా రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలి.

"స్కూలుకు సరైన సమయానికి బ్రేక్‌ఫాస్ట్ అందించడం వల్ల పిల్లలు వేళకు పాఠశాలకు వస్తారు. వారు ఆకలితో కాకుండా ఉత్సాహంగా చదువుకోగలుగుతారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు," అని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More