జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. నిఘా మామూలుగా ఉండదు!

తెలంగాణ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సమయం దగ్గరకు వచ్చింది. పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Published on: Nov 10, 2025, 19:00:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు చాలా సీరయస్‌గా తీసుకున్నాయి. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సమయాన్ని ఈసీ గంటసేపు పెంచింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2.08 లక్షలకు పైగా పురుషులు, 1.92 లక్షలకు పైగా మహిళలు. ఈ ఏడాది జూన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ బై పోల్‌లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డిని నిలబెట్టగా, మాగంటి గోపీనాథ్ భార్య సునీత బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎఐఎంఐఎం మద్దతు పొందుతున్నారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకారం.. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలలో 226 పోలింగ్ కేంద్రాలు క్లిష్టమైనవిగా గుర్తించారు.

పోలింగ్ కోసం 1,761 మంది పోలీసులతో పాటు, ఎనిమిది కంపెనీల కేంద్ర పారామిలిటరీ దళాలు(CISF) మోహరించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తగినంత భద్రత కల్పించే ఏర్పాట్లు చేశారు. అలాగే పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి మొబైల్ స్క్వాడ్‌లతో పాటు.. అన్ని పోలింగ్ కేంద్రాలలో పోల్ ప్రత్యక్ష ప్రసారం కోసం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. డ్రోన్ నిఘా కూడా ఉంటుంది.

407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ ఉంటుంది. కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీములను ఏర్పాటు చేశారు. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇప్పటిదాకా 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.

నవంబర్ 9న సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రాంతాలలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. వైన్ షాపులు మూసివేశారు. కౌంటింగ్ రోజున కూడా నవంబర్ 14న ఉదయం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ ఉత్తర్వు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More