Amit Shah Telangana Visit : ఈనెల 4న తెలంగాణలో అమిత్ షా పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లాలో అముల్ డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాల సిల్వర్ జూబ్లీ  ఉత్సవాల్లో పాల్గొంటారు.

Published on: Oct 2, 2026, 22:21:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 4వ తేదీ శనివారం నాడు ఆయన రాష్ట్రంలో పలు అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

కేంద్రమంత్రి అమిత్ షా
కేంద్రమంత్రి అమిత్ షా

ఈ పర్యటనలో భాగంగా హోంమంత్రి అమిత్ షా ముందుగా మెదక్ జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ శబర్ డెయిరీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు, డెయిరీ దిగ్గజం 'అమూల్' తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మొదటి ఆధునిక డెయిరీ ప్లాంట్ నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు. ఈ నూతన ప్రాజెక్టుల రాకతో తెలంగాణలోని పాడి రంగానికి, స్థానిక రైతులకు సరికొత్త ఊపు లభిస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మెదక్ కార్యక్రమం అనంతరం హోంమంత్రి అమిత్ షా కరీంనగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ ప్రతిమ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రతిమ డిఎమ్‌డ్ యూనివర్సిటీ నూతన భవనానికి శంకుస్థాపన చేసి…. అనంతరం వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

తెలంగాణపై కేంద్రం ప్రత్యేక దృష్టి - కిషన్ రెడ్డి

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ గత 12 ఏళ్ల పాలనలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఎన్‌డీసీడీ ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. 1.16 లక్షల కోట్లు కేటాయించామని చెప్పారు.

ముఖ్యంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణకు ఎన్డీసీడీ నిధులు ఎంతో దోహదపడ్డాయని ఆయన గుర్తుచేశారు. ఇప్పటివరకు ధాన్యం సేకరణ కోసమే ఎన్డీసీడీ ఏకంగా రూ. 60,000 కోట్లను అందించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే 2025-26 ఖరీఫ్, రబీ సీజన్ల ధాన్యం కొనుగోలు కోసం రూ. 37,000 కోట్లను విడుదల చేయగా, రాబోయే 2026-27 రబీ సీజన్ నిమిత్తం మరో రూ. 22,700 కోట్లను మంజూరు చేసినట్లు వివరించారు. ఎన్డీసీడీ నుంచి తెలంగాణకు ఎన్నడూ లేనంతగా అపూర్వమైన మద్దతు లభించిందని తెలిపారు.

ఇటీవలే పార్లమెంట్ ఆమోదించిన 'నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు-2026' ద్వారా కేవలం రిజిస్టర్డ్ సహకార సంఘాలకే కాకుండా సహకార రంగంలోని ఏ సంస్థకైనా నిధులు పొందే అవకాశం లభించిందని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ చట్ట సవరణ వల్ల తెలంగాణకు చాలా పెద్ద ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 1 కోటి మంది సభ్యులతో దాదాపు 50,000 సహకార సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని, బలమైన సహకార వ్యవస్థ వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు.

అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ అక్టోబర్ 1వ తేదీన పరిశీలించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఈ ప్రతిమ వైద్య కళాశాలను నాటి కేంద్ర హోంమంత్రి ఎల్.కె. అద్వానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రారంభించారని చెప్పారు. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత మళ్లీ అదే హోదాలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావడం విశేషమన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More