Schools Bandh : నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విద్యాసంస్థల బంద్

Schools Bandh : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు నేడు(జులై 24) బంద్‌ను పాటిస్తున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపును దృష్టిలో పెట్టుకుని విదాసంస్థలు మూసి ఉంటాయి.

Published on: Jul 24, 2026, 05:49:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలలతో పాటు విశ్వవిద్యాలయాల బంద్‌కు పలు విద్యార్థి, యువజన సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, విద్యార్థులపై దాడికి నిరసనగా ఈ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ కొనసాగుతోందని వామపక్ష విద్యార్థి సంఘాలు చెప్పాయి.

తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు బంద్
తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు బంద్

నీట్ (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు పలు కీలక డిమాండ్లతో నిరసనకు దిగాయి. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన తీవ్ర లోపాలు, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

వరుస పేపర్ లీకేజీలతో అపకీర్తి మూటగట్టుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని పూర్తిగా రద్దు చేయాలని విద్యార్థులు అంటున్నారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువజన నాయకులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, అక్రమ అరెస్టులపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని పేర్కొన్నారు.

విద్యా వ్యవస్థను కేంద్రీకరించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, వివిబిఎస్ఏ (VVBSA) బిల్లును పూర్తిగా రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విద్యాసంస్థల బంద్ పిలుపునకు ప్రధాన వామపక్ష విద్యార్థి సంఘాలైన SFI, AISF, PDSU, AISA, AIFDS లతో పాటు NSUI, DYFI, AIYF, AISB, AIPSU తదితర సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయి.

హైదరాబాద్‌తో పాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలు, వర్సిటీ క్యాంపస్‌లలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించేందుకు విద్యార్థి నేతలు సన్నాహాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ బంద్‌కు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థలపై ప్రభావం బంద్ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు ముందస్తు జాగ్రత్త చర్యగా మూతపడ్డాయి.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సమాచారం అందించి సెలవు ప్రకటించాయి. ఇది విద్యార్థి సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చిన బంద్ మాత్రమే. ప్రభుత్వాలు అధికారికంగా ఎటువంటి ప్రభుత్వ సెలవు ప్రకటించలేదు.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కొనసాగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాన్ని ఎండగడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు ప్రాంతాల్లో వినూత్న నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని ఏరిపారేయాలని, విద్యార్థుల కష్టాన్ని బ్రోకర్లకు విక్రయించే వ్యవస్థను బూడిద చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More