కూకట్‌పల్లిలో యాపిల్ స్టోర్ రెంట్ ఎంతో తెలుసా?

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని లేక్ షోర్ మాల్‌లో 11,890 చదరపు అడుగుల స్థలాన్ని యాపిల్ లీజుకు తీసుకుంది. నెలకు రూ.18.50 లక్షల కనీస అద్దెతో కుదిరిన ఈ ఒప్పందం 10 ఏళ్ల 9 నెలల పాటు అమల్లో ఉంటుంది. డిసెంబరు 10న ఈ స్టోర్ ప్రారంభం కానుంది.

Published on: Nov 27, 2026, 15:32:19 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ నగరంలో రిటైల్ విస్తరణకు సిద్ధమైంది. కూకట్‌పల్లిలోని లేక్ షోర్ మాల్‌లో 11,890 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని యాపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీజుకు తీసుకుంది. ప్రాప్‌స్టాక్ సేకరించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లీజు గడువు పదేళ్ల తొమ్మిది నెలలు.

కోపా మాల్ లోని ఆపిల్ కోరెగావ్ పార్క్
కోపా మాల్ లోని ఆపిల్ కోరెగావ్ పార్క్

నవంబరు 26న విడుదల చేసిన ప్రకటనలో డిసెంబరు 10న స్టోర్ ప్రారంభిస్తామని యాపిల్ వెల్లడించింది. ఈ స్టోర్‌తో దేశంలో యాపిల్ రిటైల్ స్టోర్ల సంఖ్య ఏడుకు చేరుతుంది. నగరంలో ఇప్పటికే యాపిల్ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) బృందాలతో పాటు రిటైల్ కస్టమర్ కేర్ బృందాలు పనిచేస్తున్నాయి.

నెలవారీ అద్దె రూ.18.50 లక్షలు.. రెవెన్యూ వాటా

మాల్ లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ ఫ్లోర్లలో ఉన్న ఈ స్థలాన్ని కూకట్‌పల్లి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యాపిల్ లీజుకు తీసుకుంది. రిజిస్ట్రేషన్ పత్రాల వివరాల ప్రకారం, నెలవారీ కనీస అద్దె రూ.18.50 లక్షలుగా ఖరారు చేశారు. దీని ప్రకారం వార్షిక అద్దె సుమారు రూ.2.22 కోట్లు అవుతుంది. చదరపు అడుగుకు నెలకు రూ.155.50 చొప్పున లేదా నికర ఆదాయంలో 2 శాతం.. వీటిలో ఏది ఎక్కువైతే దాన్ని అద్దెగా చెల్లించేలా ఒప్పందం కుదిరింది.

ప్రతి మూడేళ్లకు ఒకసారి కనీస అద్దెను 15 శాతం పెంచే నిబంధన ఒప్పందంలో ఉంది. 37వ నెల నుంచి ఆదాయ వాటా (రెవెన్యూ షేర్) 2 శాతం నుంచి 2.5 శాతానికి పెరుగుతుంది. అయితే ఏ త్రైమాసికంలోనైనా లేదా క్యాలెండర్ ఏడాదిలోనైనా రెవెన్యూ వాటాతో కలిపి చెల్లించే మొత్తం అద్దె, వర్తించే కనీస అద్దెకు రెట్టింపు మించకూడదని పరిమితి విధించారు.

డిపాజిట్ రూ.1.11 కోట్లు.. జనవరి 15 నుంచి అద్దె

ఒప్పందం కింద యాపిల్ రూ.1.11 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. లీజు కాలపరిమితి 2026 ఏప్రిల్ 15న ప్రారంభమైంది. ఇంటీరియర్ పనుల కోసం తొమ్మిది నెలల పాటు అద్దె మినహాయింపు ఇచ్చారు. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యే తేదీ లేదా 2027 జనవరి 15.. వీటిలో ఏది ముందు వస్తే అప్పటి నుంచి అద్దె చెల్లింపులు మొదలవుతాయి. 10 ఏళ్ల 9 నెలల ప్రాథమిక గడువు ముగిసిన తర్వాత, మరో ఐదేళ్లు (60 నెలలు) పొడిగించుకునే అవకాశం కూడా ఒప్పందంలో ఉంది.

దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్ల ప్రస్థానం.. ఉత్పత్తుల శ్రేణి

2023 ఏప్రిల్‌లో ముంబయిలోని బీకేసీలో తొలి రిటైల్ స్టోర్‌తో యాపిల్ భారత్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఢిల్లీలోని సాకేత్‌లో స్టోర్ ప్రారంభించింది. అనంతరం బెంగళూరు, పుణె, నోయిడాలకు విస్తరించింది. 2026 ఫిబ్రవరిలో ముంబయిలో రెండో స్టోర్‌ను బోరివలిలో తెరిచింది. ఇప్పుడు కూకట్‌పల్లి స్టోర్ ఏడోదిగా నిలవనుంది.

కూకట్‌పల్లి స్టోర్‌లో వినియోగదారులు యాపిల్ ఉత్పత్తులన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ డ్యూయో, ప్రోఎల్ఈడీ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, టచ్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో, యాపిల్ వాచ్ సిరీస్ 12, అల్ట్రా 4, ఎయిర్‌పాడ్స్ 5, హోమ్‌వ్యూ, హోమ్‌పాడ్ మినీ 2 వంటి తాజా ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

వీటితో పాటు యాపిల్ స్పెషలిస్ట్‌లు, క్రియేటివ్‌లు, జీనియస్‌లు, ప్రత్యేక బిజినెస్ బృందాల నుంచి నిపుణుల సూచనలు పొందవచ్చు. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వాడకం నుంచి ఫొటోగ్రఫీ, వీడియో, డ్రాయింగ్ వర్క్‌షాపుల వరకు రోజువారీ ఉచిత 'టుడే ఎట్ యాపిల్' సెషన్లలో పాల్గొనే వీలుంటుంది.

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.