iPhone Air 2 : పవర్‌ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, బెటర్ కెమెరాతో ఐఫోన్ ఎయిర్ 2?
యాపిల్ ఐఫోన్ లవర్స్ ఎదురుచూస్తున్న అత్యంత స్లిమ్ స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ ఎయిర్ 2' కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. శక్తివంతమైన 2ఎన్ఎం ఏ20 ప్రాసెసర్, డ్యూయల్ 48ఎంపీ కెమెరా, పెద్ద బ్యాటరీతో రానున్న ఈ నయా మోడల్ విశేషాలు ఇవే.
స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసిన స్లిమ్ యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో తదుపరి మోడల్ ‘ఐఫోన్ ఎయిర్ 2’కి సంబంధించిన సంచలనాత్మక వివరాలు లీక్ అయ్యాయి. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' వేదికగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. మొదటి తరం ఐఫోన్ ఎయిర్‌లో వినియోగదారులు ఎదుర్కొన్న రెండు ప్రధాన లోపాలు ఈ కొత్త వేరియంట్‌లో పరిష్కారం కానున్నాయి. అవి.. చిన్న బ్యాటరీ, అల్ట్రా-వైడ్ కెమెరా లేకపోవడం.

భారతీయ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న విపరీతమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఈ నయా మోడల్‌ను మరింత పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌గా యాపిల్ తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
ఐఫోన్ ఎయిర్ 2 డిస్‌ప్లే, నెక్ట్స్-జెన్ 2ఎన్ఎం ప్రాసెసర్..
ఐఫోన్ ఎయిర్ 2లో 6.55-అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1.5కే+ రెజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే ప్యానెల్‌లో ఎల్టీపీఓ సాంకేతికతను వాడటం వల్ల బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గుతుంది.
అత్యంత విశేషం ఏంటంటే, ఈ ఫోన్ యాపిల్ స్వంతంగా అభివృద్ధి చేస్తున్న 2ఎన్ఎం (2 నానోమీటర్) మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆధారిత 'ఏ20 సిరీస్' చిప్‌సెట్‌తో రానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రాసెసర్లతో పోలిస్తే ఇది అత్యుత్తమ ప్రాసెసింగ్ స్పీడ్‌ను, అద్భుతమైన పవర్ ఎఫీషియెన్సీని అందిస్తుంది. గేమింగ్, హెవీ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా అల్ట్రా-ఫాస్ట్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది.
ఐఫోన్ ఎయిర్ 2.. డ్యూయల్ 48ఎంపీ కెమెరాతో!
మొదటి తరం ఐఫోన్ ఎయిర్‌లో కేవలం ఒకే ఒక 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మాత్రమే ఉంది. అయితే కొత్త ఐఫోన్ ఎయిర్ 2 లో యాపిల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించబోతోంది:
- ప్రధాన కెమెరా: 48 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ సెన్సార్
- రెండో కెమెరా: 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్
- ఈ అల్ట్రా-వైడ్ కెమెరా అప్‌గ్రేడ్ వల్ల వైడ్-యాంగిల్ ల్యాండ్‌స్కేప్ ఫోటోలు, గ్రూప్ సెల్ఫీలు తీయడం మరింత సులువవుతుంది. పనోరమిక్ వ్యూస్, క్రిస్టల్ క్లియర్ క్వాలిటీతో ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది మంచి అనుభూతిని ఇస్తుంది.
ఐఫోన్ ఎయిర్ 2 బ్యాటరీ కెపాసిటీ, డిజైన్ లీక్స్..
మొదటి మోడల్‌లోని 3,149ఎంఏహెచ్ బ్యాటరీ స్థానంలో, ఐఫోన్ ఎయిర్ 2 లో దాదాపు 3,500ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చనున్నట్లు సమాచారం. ఇది గత మోడల్ కంటే దాదాపు 11 శాతం పెద్దది.
బాడీ విషయంలో యాపిల్ రాజీపడలేదు. ఈ ఫోన్ కేవలం 5.2ఎంఎం మందం కలిగి అత్యంత స్లిమ్‌గా ఉండనుంది. భవిష్యత్తు నెట్‌వర్క్ అవసరాల కోసం యాపిల్ సొంతంగా తయారుచేసిన ఎన్2 వైర్‌లెస్ చిప్, సీ2 మోడెమ్‌ను పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి.
ఐఫోన్ ఎయిర్ 2.. భారత్‌లో విడుదల ఎప్పుడు?
యాపిల్ గత సెప్టెంబర్ 2025లో భారత మార్కెట్లో మొదటి తరం ఐఫోన్ ఎయిర్‌ను రూ. 1,19,900 (256జీబీ వేరియంట్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. కాగా, కొత్త లీక్స్ ప్రకారం 'ఐఫోన్ ఎయిర్ 2' ను యాపిల్ 2027 వేసవిలో మార్కెట్లోకి తీసుకొచ్చే యోచనలో ఉంది. ఇది యాపిల్ ఐఫోన్ 18, ఐఫోన్ 18ఈ మోడళ్లతో పాటు అధికారికంగా ఆవిష్కృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.
యాపిల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే దీని ధర, ఇతర ఫీచర్ల వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడికానున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


