ఈసీ పనితీరుపై అనుమానాలు.. ఎస్‌ఐఆర్‌పై సుప్రీంలో పిటిషన్: ఒవైసీ

ఎస్ఐఆర్ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయో లేదో తెలియడం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఎస్ఐఆర్ నోటిఫికేషన్‌ను, ఫారమ్‌లలో తెచ్చిన మార్పులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పునఃపరిశీలన (రివ్యూ) పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.

Published on: Oct 15, 2026, 06:54:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహరిస్తున్న తీరుపై ఏఐఎమ్‌ఐఎమ్‌ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ రాజ్యాంగబద్ధంగా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, నిర్ణయాలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయా లేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే విషయాలు బయటకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు చట్టబద్ధమైన నమూనా ఫారమ్‌లలో చేసిన మార్పులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌తో పాటు రివ్యూ పిటిషన్‌ను కూడా దాఖలు చేసినట్లు బుధవారం విలేకరుల సమావేశంలో ఒవైసీ వెల్లడించారు.

ఈసీ పనితీరుపై అనుమానాలు.. ఎస్‌ఐఆర్‌పై సుప్రీంలో పిటిషన్: ఒవైసీ (Sanjeev Gupta )
ఈసీ పనితీరుపై అనుమానాలు.. ఎస్‌ఐఆర్‌పై సుప్రీంలో పిటిషన్: ఒవైసీ (Sanjeev Gupta )

ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టులో పోరాటం

గతంలో బీహార్ ఎస్ఐఆర్ వ్యవహారంలోనూ తాము పిటిషనర్‌గా ఉన్నామని ఒవైసీ గుర్తుచేశారు. "ఎస్ఐఆర్ ప్రక్రియకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం గతంలో తీర్పు ఇచ్చినప్పటికీ, ఈ ప్రక్రియలో సరైన పారదర్శకత లేకపోవడంతో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాం. ఓటర్ల నమోదు ఫారమ్‌లలో ఎందుకు మార్పులు చేశారో స్పష్టమైన సమాచారం లేదు" అని ఆయన వివరించారు. ఎస్ఐఆర్ నమోదు సమయంలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లలో ప్రజలకు సహాయం చేయడానికి తమ పార్టీ ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించిందని, ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా తమ స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

యూపీ ఎన్నికల్లో పొత్తుకు సిద్ధం

ఉత్తరప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి ఒవైసీ మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలతో పొత్తు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "బీజేపీని నిరోధించాలనుకుంటే మాతో కలసి మాట్లాడండి. కూటమిగా ఏర్పడి పోరాడదాం" అని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఘోర పరాజయం తప్పదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. హైదరాబాద్‌లో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసినా ఎంఐఎం విజయాన్ని అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ ద్వంద్వ నీతిపై ధ్వజమెత్తు

కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో తమ మద్దతు కోరిన కాంగ్రెస్, ఢిల్లీ లేదా ఇతర ప్రాంతాల్లో ఎంఐఎంను దూరం పెట్టడాన్ని తప్పుపట్టారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అనర్హత వేటుకు గురవడంతో అక్కడ జరగనున్న ఉపఎన్నికను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు కురిపించారు. ఎస్ఐఆర్ నిరసనలను కొందరు ఎలైట్ క్లబ్‌లా మార్చుకుంటున్నారని, ఏ ఒక్క పార్టీకి ఈ అంశంపై పేటెంట్ హక్కులు లేవని స్పష్టం చేశారు.

ఎలాన్ మస్క్‌పై మండిపాటు.. జంతర్ మంతర్ ధర్నాలపై వ్యాఖ్యలు

శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల విషయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీరును ఒవైసీ తప్పుపట్టారు. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఛార్జీలు ఉన్నాయని, తెల్ల జాతీయులు భారత్‌కు నిబంధనలు నిర్దేశించడమేంటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కఠిన వైఖరితో మస్క్‌కు "బై-బై" చెప్పాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్‌ను నిరసన ప్రాంతాల జాబితా నుంచి తొలగించడాన్ని ఒవైసీ విమర్శించారు. హింస లేనంత వరకు శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇటీవల సీజేపీ (CJP) నేతల అరెస్టును ఖండిస్తూ, వారికి పోలీసు స్టేషన్‌లోనే బెయిల్ లేదా నోటీసు ఇస్తే సరిపోయేదని అభిప్రాయపడ్డారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More