భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా నడుస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తడంతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో వికసిస్తోంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, జోగినుల నృత్యాలతో పాతబస్తీ వీధులన్నీ కోలాహలంగా మారాయి.

ఉదయం 4:30 గంటలకే ఆలయ తలుపులు తెరిచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి తొలిబోనాన్ని సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. రాత్రి 10:30 గంటల వరకు భక్తులు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, పట్టువస్త్రాలు, చీర, సారె సమర్పించేందుకు అనుమతి ఉంటుంది. సాయంత్రం వేళ అమ్మవారి శాంతి కళ్యాణం మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.
బోనాల జాతర సందర్భంగా పలువురు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు సినీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. లాల్ దర్వాజా అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలయాన్ని దర్శించుకుని బంగారు బోనాన్ని నివేదించారు.
అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారిని మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. మంత్రి సీతక్క, ఎంపీ అనిల్ యాదవ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టాలీవుడ్ కథానాయకులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రముఖ గాయని మంగ్లీ తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
లాల్ దర్వాజా పరిసరాల్లో దాదాపు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణ దర్శనం, బోనాలు మోసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా 6 క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}లాల్ దర్వాజా పరిసరాల్లో దాదాపు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణ దర్శనం, బోనాలు మోసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా 6 క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}ఉచిత తాగునీటి కేంద్రాలు, ప్రాథమిక వైద్య సహాయం కోసం మెడికల్ క్యాంపులు, అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా 100 సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాడు అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం జరగనుంది. దీనితో పాటు పోతురాజుల విన్యాసాలు, ఏనుగుపై అమ్మవారి భవాని రథయాత్ర గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. లాల్ దర్వాజాతో పాటు పరిసరాల్లోని దాదాపు అనేక దేవాలయాల్లో కూడా ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి.