2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు మంచి ఛాన్స్!

బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పోస్టులు ఉన్నాయి.

Published on: Sep 14, 2026, 15:04:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న తమ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేసేందుకు 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్
బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్

నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 80 పోస్టులు, తెలంగాణలో 50 పోస్టులు ఉన్నాయి. మొత్తం 2,482 ఖాళీల్లో తెలుగు రాష్ట్రాల పరిధిలో 130 ఆఫీసర్ పోస్టులు అందుబాటులో ఉంటాయి.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో కనీసం ఒక సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండటం తప్పనిసరి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి చెందిన స్థానిక భాషను (తెలుగు) చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

01 ఆగస్టు 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ బేసిక్ పే రూ.48,480 నుండి ప్రారంభమై రూ.85,920 వరకు ఉంటుంది. దీనితో పాటు బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర ఇతర భత్యాలు కూడా లభిస్తాయి. ఈ పోస్టులకు అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (భాషా నైపుణ్య పరీక్ష), గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

120 మార్కులతో 120 ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాలు సమయం ఉంటుంది. ఇంగ్లీష్ (30 మార్కులు), బ్యాంకింగ్ నాలెడ్జ్ (30 మార్కులు), జనరల్/ఎకనామిక్ అవేర్‌నెస్ (30 మార్కులు), రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ (30 మార్కులు). ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనిక ఉద్యోగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు రూ.175 గా నిర్ణయించారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం 18 ఆగస్టు 2026న మెుదలైంది. దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 17 సెప్టెంబరు 2026గా ఉంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More