పోడు భూములపై త్వరలోనే గుడ్‌న్యూస్ అందిస్తాం : మంత్రి పొంగులేటి

పోడు భూములపై త్వరలోనే గుడ్‌న్యూస్ అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాలుగా ఉన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తోందన్నారు.

Published on: Oct 4, 2026, 19:48:13 IST
By , Khammam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, బృందాలుగా గ్రామ, మండల స్థాయిలో విస్తృతంగా పనిచేయాలని నాయకులను, కార్యకర్తలను కోరారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

'ప్రజాపాలనలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకుని సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలా ముందుకు సాగుతున్నాం. దశాబ్దాలుగా ఉన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తూ రాష్ట్రంలోని రైతులకు, సామాన్యులకు భూసమస్యల నుంచి ఊరట కలిగిస్తున్నది ప్రజా ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తరతరాలుగా పోడు చేసుకుంటూ, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారి భూసమస్యల పరిష్కారంపై, అటవీ భూములకు సంబంధించి కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. కేంద్రంతో సంప్రదించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రభుత్వం దానిపై ఆలోచన చేసి కార్యరూపం దాల్చేలా త్వరలోనే తీపి కబురు ప్రకటిస్తాం.' అని పొంగులేటి చెప్పారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కట్టుకాచారంలో సుమారు రూ. 25 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు మండలంలోని 31 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

నారాయణపురంలో శ్రీ షిరిడి సాయి జన మంగళం ట్రస్టు సహకారంతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం గ్రామంలో తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం, ల్యాబొరేటరీలను సందర్శించి, స్వయంగా రక్తపరీక్ష చేయించుకున్నాను. రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే, తాన్లా ఫౌండేషన్ తరఫున ఉదయ్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో రూ.300 కోట్లతో 5,000 ఇళ్లను నిర్మించి ఇస్తానని ముందుకు వచ్చారని మంత్రి పొంగులేటి చెప్పారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తుండగా.. దాతృత్వ సంస్థలు కూడా ప్రభుత్వంతో చేతులు కలపడం అభినందనీయమన్నారు. దసరా పండుగ రోజున ఈ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు.

ఇక సత్తుపల్లి మున్సిపాలిటీలో 12వ వార్డు ద్వారకాపురి కాలనీలో రూ. 40 లక్షలతో సీసీరోడ్లు, డ్రైనేజీలు, రూ. 40.50 లక్షలతో 14వ వార్డు గాంధీనగర్ లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, రూ. 50 లక్షలతో 1వ వార్డు గుడిపాడులో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అదే విధంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం పినపాకలో అర్హులైన 79 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More