30 ఎకరాలకు రూ.30 లక్షల లంచం డిమాండ్.. డ్రైవర్ ద్వారా డీల్ చేసిన ఎమ్మార్వో!

తెలంగాణలో అవినీతి తిమింగలాలపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఇటీవల వరుసగా కొందరు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తాజాగా ఓ ఎమ్మార్వో కూడా ఏసీబీకి చిక్కారు.

Published on: May 26, 2026, 19:26:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఏసీబీ దాడులు కొనసాగుతున్నా.. కొందరు అధికారుల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలంలో భారీ ఎత్తున లంచం తీసుకుంటూ ప్రభుత్వ అధికారిణి పట్టుబడటం తీవ్ర సంచలనంగా మారింది.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో

నాలా(NALA) కన్వర్షన్ కోసం రూ. 30 లక్షల లంచం డిమాండ్ చేస్తూ.. ఓ లంచగొండి తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. మే 26, 2026 (మంగళవారం) మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో రంగారెడ్డి రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన మెరుపు దాడిలో ఈ బాగోతం వెలుగుచూసింది.

రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట మండల తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ టి. సుచరిత ఒక భూమి వ్యవహారంలో భారీగా లంచం డిమాండ్ చేశారు. సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూమిని నాలా (NALA - Non-Agricultural Lands Assessment Act) కింద కన్వర్షన్ చేసేందుకుగానూ ఆమె బాధితుడి నుండి ఏకంగా రూ. 30 లక్షల లంచం డిమాండ్ చేశారు.

డ్రైవర్ ద్వారా డీల్

మొత్తం లంచం డబ్బులో భాగంగా మొదటి విడతగా రూ. 2 లక్షలు ఇవ్వాలని తహసీల్దార్ సుచరిత చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఆదేశాల మేరకు ఆమె ప్రైవేట్ డ్రైవర్ వి.నాగేష్ బాధితుడి నుండి ఆ రెండు లక్షల రూపాయలను తీసుకుంటుండగా, ముందే వ్యూహాత్మకంగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రైవర్‌తోపాటు తహసీల్దార్ సుచరితను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం, ఆమె నివాసాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇటీవల మరో ఏసీబీ దాడి

తెలంగాణలో రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో అవినీతి తిమింగలాలు వరుసగా ఏసీబీకి చిక్కుతున్నాయి. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే హైదరాబాద్ శివార్లలోని కబ్జాకు గురైన భూమిని సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించడానికి ఓ సర్వేయర్, మరో అధికారి రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నాలా కన్వర్షన్లు, మ్యుటేషన్ల కోసం రైతులు, రియల్టర్లను అధికారులు ఇలా పీడించుకుతింటున్నారనే దానికి ఈ వరుస ఘటనలే నిదర్శనం.

ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు కోరారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమేనని గుర్తుచేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More