గురుకులాల్లో రూ. 2000 కోట్ల స్కామ్ జరిగిందని హరీశ్ రావు ఆరోపణలు.. మంత్రి అడ్లూరి సవాల్

గురుకులాల్లో రూ. 2000 కోట్ల కుంభకోణం వాస్తవం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సొంత శాఖల టెండర్లపై మంత్రులకు కనీస అవగాహన లేదని ఆరోపించారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు.

Published on: Jun 16, 2026, 18:03:53 IST
By , Karimnagar
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం అల్గనూర్ గ్రామంలోని లక్ష్మీనరసింహ గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మానకొండూర్ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో ఊరూరా ఎంత అద్భుతంగా పోరాడారో తనకు తెలుసు అన్నారు. 2001లో పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిచిన కరుడుగట్టిన కార్యకర్తలున్న గొప్ప నియోజకవర్గం ఇది అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా బ్రహ్మాండమైన బలగం ఉన్న పార్టీ మన బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావు
మాజీ మంత్రి హరీశ్ రావు

'గురుకులాల్లో 2000 కోట్ల స్కామ్ జరిగిందని నేను వాస్తవాలు మాట్లాడితే, మంత్రులు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ నాకు ఛాలెంజ్ చేస్తున్నారు. బట్టలు, బూట్లకు 1200 కోట్లు, ఉప్పులు పప్పులు కోడిగుడ్లకు 800 కోట్లతో టెండర్లు పిలిచిన విషయమే సంబంధిత మంత్రులకు తెలవకపోతే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎనుముల వారి అన్నదమ్ములే ఈ టెండర్లన్నీ మింగుతున్నారు.' అని హరీశ్ రావు అన్నారు.

కోటిమంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నాడు కానీ ఎనుముల వారి నలుగురు అన్నదమ్ములు మాత్రమే కోటీశ్వరులు అయ్యారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12000 రూపాయలు ఇస్తామని మూడు బడ్జెట్లలో చదివారని, ఏ ఒక్క కూలీకి అయినా ఒక్క రూపాయి వచ్చిందా? అని ప్రశ్నించారు.

ఖజానా ఖాళీ అంటూ.. ఫ్యూచర్ సిటీలో 100 కోట్లతో, ఎంసీహెచ్ఆర్డీలో మరో 100 కోట్లతో క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి, సచివాలయంలో వాస్తు మార్పులకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడని ఆరోపించారు. ఎగవేతల రేవంత్ రెడ్డి అనక ఏమనాలి? ఈ మాట అన్నందుకే మానకొండూరు పోలీస్ స్టేషన్లో తన మీద కేసు పెట్టి నోటీసులు పంపారన్నారు హరీశ్ రావు.

'రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏకంగా మూడు రైతు బంధులు ఎగబెట్టిండు. ఒకసారి పూర్తిగా ఎగబెట్టి 9000 కోట్లు, తర్వాత మూడు ఎకరాలకు ఇచ్చి 4000 కోట్లు, ఇప్పుడు రెండు ఎకరాలకు ఇచ్చి 6000 కోట్లు.. మొత్తం 19వేల కోట్ల రూపాయల రైతు బంధు బాకీ పడ్డాడు. ఈ బాకీ పడ్డ 19వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని మానకొండూరు గడ్డ మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం.' అని హరీశ్ రావు అన్నారు.

కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 5,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తా అంటున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. నిరుద్యోగులు దిల్‌సుఖ్‌నగర్, చిక్కడపల్లిలో ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, కేసీఆర్ ఒకేసారి 17,000 పోలీసు ఉద్యోగాలను నింపారని గుర్తు చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడంతో మానకొండూర్, అల్గనూర్, తిమ్మాపూర్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని, ఆఫీసుల్లో ఈగలు తోలుకుంటున్నారు, ప్లాటు అమ్ముకుందామన్నా కొనే దిక్కు లేదన్నారు.

మంత్రి అడ్లూరి సవాల్

2000 కోట్లు స్కాం జరిగిందని హరీష్ ఆరోపిస్తున్నారని, హరీష్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హరీష్ చెప్పేది నిజమని నిరూపిస్తే అక్కడే రాజీనామా చేస్తానన్నారు. తనకు, పొన్నంకి తెలియకుండా టెండర్లు వచ్చాయనేది అబద్దమని పేర్కొన్నారు. తనకు దోచుకోవడం, దాచుకోవడం తెలియదని స్పష్టం చేశారు. మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదన్నారు.

'రేవంత్ ప్రభుత్వంలో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. గత ప్రభుత్వ పాపాలను కడుక్కుంటూ వస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లులు మేం క్లియర్ చేస్తూ వస్తున్నాం. గతంలో కేసీఆర్, హరీష్, కేటీఆర్ లకు తప్పా మిగతా మంత్రులకు అధికారమే లేదు పిల్లల యూనిఫామ్, బెడ్ షీట్లు, ఇతరాల కోసం ఆన్లైన్ టెండర్లు పిలిచాం. టెండర్లు ఇచ్చే ముందు ముగ్గురు మంత్రులతో సీఎం రివ్యూ చేశారు. టెండర్ల గురించి నాకు, పొన్నంకి తెలియదని హరీష్ అబద్ధాలు మాట్లాడుతున్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్కూల్ విద్యార్థులను బాగు చేస్తుంటే మాపై ఆరోపణలు చేస్తున్నారు. సొంత పత్రికలో అబద్ధాలను పదేపదే రాయిస్తున్నారు. 2 వేల కోట్ల స్కాం జరిగిందని హరీష్ అబద్ధాలు చెబుతున్నాడు. టెండర్లపై సీఎం రేవంత్ ముగ్గురు మంత్రులతో సమీక్ష నిర్వహించారు.' అని మంత్రి అడ్లూరి అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More