కాగ్ రిపోర్టుతో రేవంత్ ప్రభుత్వం కళ్లు తెరవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలకాలని చెప్పారు. రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. కాగ్ రిపోర్టు రేవంత్ సర్కారుకు చెంప పెట్టు లాంటిదన్నారు.

తాము ఈ ప్రభుత్వ పని తీరుపై నిలదీస్తున్న అంశాలనే కాగ్ ప్రస్తావించిందని హరీశ్ రావు అన్నారు. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీగా నిధులు పెట్టి ఖర్చు పెట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందిన విషయాన్ని కాగ్ తప్పుపట్టిందన్నారు. అంకెల్లో గోల్ మాల్ ఆచరణలో అంతకన్నా గోల్ మాల్ ఉందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టిందన్నారు.
తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ తేల్చి చెప్పిందన్నారు హరీశ్ రావు. రాష్ట్రాన్ని భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తుతున్నారని కాగ్ చెప్పకనే చెప్పిందన్నారు. మాటలు మూరెడు -చేతలు చారెడు కూడా లేవని ఈ చేవ లేని సర్కార్‌కు కాగ్ అక్షింతలు వేసిందన్నారు.
'మేం ప్రభుత్వాన్ని తప్పుబడితే పెడబొబ్బలతో మా మీద దాడి చేస్తారు. కాగ్ రిపోర్టు తర్వాత కూడా ఇంకా అవే అబద్దాలను కొనసాగిస్తారా? 2024-25 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన రిపోర్టులోనే కాగ్ అనేక ప్రభుత్వ లోపాల్ని తప్పు పట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం లెక్కలేనన్ని తప్పులు చేసింది. పాలన అంటే డొల్ల. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లు కూడా డొల్ల అని కాగ్ రిపోర్టు 2024-25 కుండబద్దలు కొట్టింది.' అని హరీశ్ రావు అన్నారు. ఈ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అని చెప్పడానికి కాగ్ రిపోర్టు నిదర్శనమన్నారు.
హరీశ్ రావు ఇంకా ఏం చెప్పారంటే..
- కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ఎంత అన్ రియలిస్టిక్? ఎంత అన్ ప్లాన్డ్ గా ఉందో మేం చెప్పడం కాదు.. ఈరోజు కాగ్ రిపోర్టుతో తేటతెల్లం అయ్యింది.
- బడ్జెట్ ఎస్టిమేట్స్ 2,21,242 కోట్లు ఉంటే, యాక్చువల్స్ 1,67,804 కోట్లు. అంటే బడ్జెట్ అంచనాల్లో చేరుకున్నది కేవలం 76శాతం.
- రెవెన్యూ ఎక్స్ పెండీచర్ 2,20,945 కోట్లు ఉంటే, యాక్చువల్స్ 1,77,224 కోట్లు. అంటే చేరుకున్నది 80శాతం. బడ్జెట్ అంచనాలకు, యాక్చువల్స్ కి ఇంత గ్యాప్ ఉంటుందా?
- రెవెన్యూ డెఫిసిట్ విషయానికి వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరపతి దెబ్బతీసే విధంగా రికార్డు స్థాయి రెవెన్యూ డెఫిసిట్ ను నమోదు చేసింది. 2014-15కు రెవెన్యూ సర్ ప్లస్ 368 కోట్లు ఉంటే, 2023-24కు 779 కోట్లకు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం.. 2024-25 కు గాను రెవెన్యూ డెఫిసిట్ ను ఏకంగా 9420కు తీసుకువెళ్లింది.
- ఒక్క కరోనా సమయం తప్ప ఎన్నడూ ఇంతగా రెవెన్యూ డెఫిసిట్ లేదు. ఇప్పుడు కరోనా లేదు, పెద్ద నోట్ల రద్దు లేదు ఏదీ లేదు. రెవెన్యూ డెఫిసిట్ మాత్రం మైనస్ 9420 కోట్లకు ఎందకు పోయినట్లు? రాష్ట్రాన్ని ఎవరు దివాళా తీసారు?
- కాగ్ లెక్కలు చూస్తే బడ్జెట్ నియంత్రణ కోల్పోయి గాడి తప్పిందని స్పష్టంగా అర్థమవుతున్నది. 7 పద్దులు, 2 అప్రాప్రియేషన్స్ లలో కలిపి మొత్తంగా 31,229 కోట్ల ఖర్చు అదనంగా జరిగింది. బడ్జెట్ లో ప్లాన్ చేసిన ఖర్చు ఒకటి.. అసలు ఖర్చు పూర్తిగా అదుపు తప్పింది.
- రెవెన్యూ సెక్షనలోనూ ఇదే గందరగోళం బడ్జెట్ లో 40,453 కోట్లు పెట్టుకొని, 50,978 కోట్లు ఖర్చు చేసారు. అంటే 10,525 కోట్ల అధిక వ్యయం. 21శాతం. ఒక ప్లాన్ అనేది ఉండదా? బడ్జెట్ లో మీరే చెప్పి మీరే ఫాలో కారా?
- FRBM పరిధి అప్పుల విషయానికి వస్తే..2024-25కు గాను GSDP లో 32.80శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి దాన్ని దాటి 34.29శాతంకు పెంచారు. 5,62,662 కోట్లకు చేరింది. అంటే ప్రభుత్వం తను పెట్టుకున్న పరిమితిని తానే దాటి ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించిందని కాగ్ వెల్లడించింది.
- బీఆర్ఎస్ పాలనలో అప్పులు చేసినట్లు వాదించే వారికి కాగ్ రిపోర్టు చెంపపెట్టు. రెవెన్యూ రిసిప్ట్స్ విషయంలో.. 2023-24లో స్టేట్ రెవెన్యూ 1,11,798 కోట్లు ఉంటే, 2024-25కు 1,09,233 కోట్లకు తగ్గింది. అంటే సుమారు 2,565 కోట్ల మేర తగ్గుదల నమోదైంది.
- వ్యాపారం, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు ఇలా ఒక్కటి కాదు అన్ని రంగాలు కుదేలయ్యాయి. దీంతో జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ, వాహన పన్నులు వంటి ఆదాయ వనరుల్లో ఘణనీయమైన తగ్గుదల నమోదైంది.
- వెహికిల్ టాక్స్ 7,095 నుంచి 6,992 కోట్లకు తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ – రెవెన్యూ కలెక్షన్ 14,296 కోట్ల నుంచి 8,473 కోట్లకు తగ్గింది. ఎస్ ఓ టి ఆర్ 1,11,798 కోట్ల నుంచి 1,09,233 కోట్లకు తగ్గింది.