Musi River : మూసీ నది ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ.. అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్

Musi River Project : మూసీ నది ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సమర్థించుకోగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది.

Published on: Mar 18, 2026, 19:44:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో ఘాటైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తాము ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, పారదర్శకత లోపించిందని ఆరోపించింది. అయితే ఈ ప్రాజెక్టు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని అధికార పక్షం వాదించింది. ప్రతిపక్షాలు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది.

మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రతిపాదిత చిత్రం
మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రతిపాదిత చిత్రం

ప్రశ్నోత్తరాల సమయంలో సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్ సహా పలువురు ఎమ్మెల్యేలు ప్రాజెక్టుపై ప్రశ్నలు లేవనెత్తడంతో చర్చ మెుదలైంది. ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. మొదటి దశకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) పూర్తయిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,000 నుంచి 7,000 కోట్లు అని వెల్లడించారు. సుమారు 1,435 నిర్మాణాలు ప్రభావితం కావచ్చని, ప్రస్తుతం తుది గణన ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.

మరోవైపు మంత్రులు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ, మూసీ నదిని కలుషితమైన మురుగు కాలువగా మార్చింది కాంగ్రెస్‌ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సాధారణంగా 18 నెలలు పట్టే డీపీఆర్‌ను కేవలం రెండు నెలల్లోనే ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు. దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

మూసీ నది అభివృద్ధిని ప్రతిపక్షాలు కోరుకోవడం లేదని ఆరోపిస్తూ, దానిని ఒక కీలకమైన పట్టణ సంపదగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శలను తిప్పికొట్టారు. ప్రభావిత నివాసితులకు పునరావాసం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు.

ప్రజాభిప్రాయ సేకరణ, పేదల తరలింపు, పునరావాసంపై వాడివేడిగా చర్చ నడిచింది. మంత్రులు ప్రభుత్వ విధానాన్ని సమర్థించుకోగా, ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తుతూనే ఉన్నారు. మంత్రుల సమాధానాలతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు కూలంకషంగా చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మాత్రం స్పష్టం చేసింది. అలాగే ఈ ప్రాజెక్టుకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను కోరింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More