...
...
Next Story

కేసీఆర్ కు సిట్ నోటీసులు : ఇది విచారణ కాదు.. ప్రతీకారం - కేటీఆర్

కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది విచారణ కాదని… ఇది ప్రతీకారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

Published on: Jan 29, 2026, 18:29:56 IST
Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ… సిట్ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. అలాంటి నాయకుడుకు నోటీసులు ఇవ్వటమా అని ప్రశ్నించారు.

కేటీఆర్
కేటీఆర్

“సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకున్నాడు. సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్. అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది” అని కేటీఆర్ విమర్శించారు.

ఇది ప్రతీకారం - కేటీఆర్

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ఈ తరహా విచారణలు చేస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. “విచారణల పేరుతో కేసీఆర్ పై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం. ఇది విచారణ కాదు.. ఇది ప్రతీకారం... ఇది న్యాయం కాదు.. ఇది రాజకీయ దురుద్దేశం. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు” అని కేటీఆర్ తెలిపారు.

“నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. బీఆర్‌ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం.తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు.. ప్రజల తీర్పుతోనే రాస్తారు” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

భయపడే ప్రసక్తే లేదు - హరీశ్ రావు

సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర… చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. అధికారం శాశ్వతం కాదు.. అహంకారం అంతకంటే కాదు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉంది. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు.. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు” అని హరీశ్ రావు హితవు పలికారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks