Census 2027 : నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్.. తొలిసారిగా జనగణనతోపాటుగా కులగణన
Census 2027 : తెలంగాణలో జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ నేటి(ఏప్రిల్ 26) నుంచి మే 10వ తేదీ వరకు చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ (Census 2027) నేటి నుంచే ప్రారంభమైంది. ఈసారి విశేషం ఏంటంటే.. పెన్ను, పేపర్ అవసరం లేకుండానే, మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ వివరాలను మీరే సులభంగా నమోదు చేసుకోవచ్చు.

మీరు ఎవరి కోసమో వేచి చూడాల్సిన పనిలేదు. ఏప్రిల్ 26 (ఆదివారం) నుండి మే 10 వరకు ఆన్‌లైన్‌లో మీ వివరాలను మీరే స్వయంగా నమోదు చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం https://se.census.gov.in వెబ్‌సైట్ వెళ్లండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంటుంది. వివరాలు నింపాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది.
మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే, మీకు ఒక 'సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ' వస్తుంది. ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు
- మొదటి దశ (మే 10 వరకు): ఆన్‌లైన్‌లో సెల్ఫ్ ఎన్యూమరేషన్.
- ఇంటింటి సేకరణ (మే 11 నుండి జూన్ 9 వరకు): ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు.
- రెండో దశ (ఫిబ్రవరి 9 - 28, 2027): తుది జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతుంది.
వివరాలు నమోదు చేసేటప్పుడు మీరు ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా డాక్యుమెంట్లు చూపించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో చేసేవారు 27 ప్రశ్నలకు, నేరుగా ఎన్యూమరేటర్లకు చెప్పేవారు 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. తెలంగాణలో మొదటిసారిగా పెన్ను, పేపర్ వాడకుండా కేవలం మొబైల్ యాప్ ద్వారానే ఈ డేటాను సేకరిస్తున్నారు. ఇది కేవలం జనాభా లెక్కల కోసం మాత్రమే. దీనికి ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదు. మీరు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే మీ వివరాలు నమోదు చేసుకోవాలి.
మీకు ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1855 కు ఫోన్ చేయవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణలో తొలిసారి కేంద్రం జనగణనతో పాటు కులగణన ప్రక్రియ చేస్తోంది.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (CURE)లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ దశ ఏప్రిల్ 26న ప్రారంభమై మే 10 వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లను ఒకే జనగణన యూనిట్‌గా పరిగణిస్తారు.
15 రోజుల వ్యవధిలో, నివాసితులు అధికారిక పోర్టల్ అయిన www.se.census.gov.in ద్వారా తమ కుటుంబ వివరాలను స్వచ్ఛందంగా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. 2027 జనాభా లెక్కలు భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనాభా లెక్కలు అవుతాయని, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు ఇదే మొదటి జనాభా లెక్కలు అవుతాయని, ఇందులో కుల గణన కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆన్‌లైన్ దశ తర్వాత, ఇంటింటి సందర్శనలు మరియు గోడలపై మార్కింగ్ చేయడంతో సహా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (HLO) మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం కోసం 21,866 మంది గణన సిబ్బందిని, 3,662 మంది పర్యవేక్షకులను నియమించనున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


