...
...
Next Story

తెలంగాణలో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కలు

తెలంగాణలో జనాభా లెక్కల సేకరణకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ చేస్తారు.

Published on: Nov 9, 2026, 22:18:04 IST
Advertisement

తెలంగాణలో జనాభా గణన (Census 2027) నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎస్ సంజయ్ జాజూ పేరుతో సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2027 జనవరి నుండి ఫిబ్రవరి వరకు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ కొనసాగనుంది. మొదటి విడతలో భాగంగా మే 11 నుండి జూన్ 9 వరకు ఇళ్ల గణన ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయిన విషయం విదితమే. ఇప్పుడు రెండో విడతలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి సమాచారం సేకరించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలో జనాభా లెక్కలు
తెలంగాణలో జనాభా లెక్కలు

రెండో విడత జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన కీలక తేదీలను ప్రభుత్వం వెల్లడించింది. 10 జనవరి 2027 నుండి 24 జనవరి 2027 వరకు యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ విధానంలో ప్రజలే నేరుగా వివరాలు నమోదు చేసుకునే ఛాన్స్ ఉంది.

25 జనవరి 2027 నుండి 28 ఫిబ్రవరి 2027 వరకు ఇంటింటికీ వెళ్లి జనాభా సేకరణ చేయనున్నారు. 01 మార్చి 2027 నుండి 05 మార్చి 2027 వరకు రివిజినల్ రౌండ్ ఉంటుంది.

ఈసారి జనాభా గణనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సిబ్బంది ఇంటికి రాకముందే ప్రజలు తమ వివరాలను తామే సొంతంగా నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2027 జనవరి 10 నుండి జనవరి 24 వరకు ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కుటుంబ యజమాని తమ కుటుంబ సభ్యుల వివరాలు, విద్య, ఉద్యోగం, మతం, భాష తదితర వివరాలను సులభంగా సబ్మిట్ చేయవచ్చు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేసిన వారికి ఒక ప్రత్యేక ఐడీ/క్యూఆర్ కోడ్ లభిస్తుంది. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ కోడ్ చూపిస్తే సరిపోతుంది.

ఫిబ్రవరి 28 తర్వాత, మార్చి 1 నుండి 5వ తేదీ మధ్యలో గణన సిబ్బంది మళ్లీ ఇళ్లను సందర్శిస్తారు. ఈ వ్యవధిలో కుటుంబంలో ఎవరైనా కొత్తగా జన్మించినా, లేదా మరణించినా ఆ వివరాలను సవరించి 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటల సమయానికి ఉన్న కచ్చితమైన జనాభాను రికార్డు చేస్తారు. పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, అలాగే జీడబ్ల్యూఎంసీ, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు ఈ జనాభా లెక్కల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ల నియామకం పూర్తయింది. వారి శిక్షణా తరగతులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ ప్రక్రియ ద్వారా లభించే కచ్చితమైన డేటా ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిధుల కేటాయింపులు, నియోజకవర్గాల పునర్విభజన ఆధారపడి ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రజలందరూ ఈ గణనలో భాగస్వాములై కచ్చితమైన సమాచారాన్ని అందించి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks