Nalgonda Crime News : ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి... ప్రభుత్వ ఉద్యోగం - 14 మంది అరెస్ట్, నిందితుల్లో అధికారులు
రిటైర్డ్ ఉద్యోగి చనిపోయినట్లు దొంగ డెత్ సర్టిఫికేట్ సృష్టించి కారుణ్య నియామకం పొందిన ఘరానా మోసాన్ని నల్గొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కేసులో అధికారులతో సహా 14 మందిని అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కొందరు ఏకంగా చనిపోని వ్యక్తిని కాగితాల్లో చంపేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి సర్వీసులో ఉండగానే చనిపోయాడని దొంగ డెత్ సర్టిఫికేట్ సృష్టించి, అతడి కొడుక్కి కారుణ్య నియామకం కింద సర్కారీ కొలువు కొట్టేశారు. నల్గొండ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘరానా మోసాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. మున్సిపల్, వైద్యారోగ్య శాఖల అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు సహా మొత్తం 14 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఆధార్ మార్పు… ఘరానా స్కెచ్
రిటైర్డ్ ఆరోగ్య శాఖ ఉద్యోగి బతికే ఉన్నప్పటికీ, అతడు సర్వీసులో ఉండగానే మరణించినట్లు చూపించేందుకు నిందితులు పెద్ద ప్లాన్ వేశారు. ముందుగా ఆధార్ కార్డులోని చిరునామా వివరాలను మార్చేశారు. ఆ తర్వాత మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులతో చేతులు కలిపి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని (డెత్ సర్టిఫికేట్) పొందారు. ప్రభుత్వ రికార్డులను సైతం ఫోర్జరీ చేసి, కారుణ్య నియామకాల కోటా కింద ఉద్యోగం పొందేలా బాటలు పరిచారు. ఈ అక్రమ నియామకం వెనుక ఏకంగా రూ. 13 లక్షల డీల్ కుదిరినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
బాధ్యులపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు (క్రైమ్ నంబర్ 299/2026) నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం మరియు ఇతర సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 5 లక్షల నగదు, ఒక కంప్యూటర్, ప్రింటర్, 12 మొబైల్ ఫోన్లు, సదరు ఉద్యోగి ఫోటోను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో…. డీఎస్పీ కే. శివరామ్ రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ వన్ టౌన్ పోలీసులు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ మోసాన్ని గుట్టురట్టు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జవాబుదారీతనాన్ని కాపాడటంలో రాజీ పడేది లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

