2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీరు : మంత్రి ఉత్తమ్

SLBC - Srisailam Left Bank Canal : 2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీరు అందించనున్నట్టుగా మంత్రి ఉత్తమ్ తెలిపారు. టన్నెల్ పనుల్లో అత్యంత కీలకమైన ఘట్టం పూర్తయిందని ప్రకటించారు.

Published on: Oct 4, 2026, 22:17:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో అత్యంత కీలకమైన, భౌగోళికంగా క్లిష్టమైన ఘట్టం పూర్తయిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టన్నెల్ నిర్మాణంలో నిరంతరం సవాళ్లు విసిరిన ప్రమాదకరమైన షియర్ జోన్‌ను దాటుకుని తవ్వకాల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు.

మంత్రి ఉత్తమ్ సమీక్ష
మంత్రి ఉత్తమ్ సమీక్ష

టన్నెల్ పనులపై హైదరాబాద్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.

సమీక్షా సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల పురోగతికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాతో పంచుకున్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో సుమారు 700 మీటర్ల మేర సొరంగం తవ్వకం పనులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

అవుట్‌లెట్ వైపు 450 మీటర్లు, ఇన్‌లెట్ వైపు 250 మీటర్ల మేర తవ్వకాలు జరిగాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మొత్తం 43.968 కిలోమీటర్ల పొడవైన ప్రధాన సొరంగ మార్గంలో ఇప్పటివరకు 79 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఇంకా 9.1 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉందని తెలిపారు.

ప్రస్తుతం రెండు వైపులా కలిపి రోజుకు సగటున 8 మీటర్ల మేర తవ్వకాలు జరుగుతున్నాయని, అదనపు ఆధునిక యంత్రాలను వినియోగించి రోజువారీ తవ్వకం వేగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. తవ్వకాల వేగాన్ని పుంజుకునేందుకు అవసరమైన అధునాతన భారీ యంత్రాలను సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. పనులను మరింత వేగవంతం చేసేందుకు జర్మనీ దేశం నుండి ప్రత్యేకంగా తెప్పిస్తున్న లోకోమోటివ్ యంత్రం అక్టోబరు చివరి నాటికి ప్రాజెక్టు స్థలానికి చేరుకునే అవకాశం ఉందన్నారు.

2028 మే - జూన్ నాటికి టన్నెల్–1 అనుసంధాన పనులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. 2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు, ఎండిపోతున్న వ్యవసాయ స్థలాలకు 30 టీఎంసీలకు పైగా నీటిని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు అత్యంత ప్రాధాన్యమైనదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. దశాబ్దాలుగా మందకొడిగా సాగుతున్న ఈ సొరంగ మార్గం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, నల్గొండ జిల్లాలోని కరువు ప్రాంతాలకు, ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. నిధుల కొరత లేకుండా పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More