Study abroad : అమెరికా వీసా కష్టాలు- భారతీయుల చూపు ఇప్పుడు జర్మనీ వైపు! ప్లస్ పాయింట్స్ ఇవే..

Germany vs USA for Indian Students : ఒకప్పుడు విదేశీ విద్య అంటే అమెరికా వైపే చూసిన భారతీయ విద్యార్థులు.. ఇప్పుడు జర్మనీ వైపు అడుగులు వేస్తున్నారు. ఫీజులు లేకపోవడం లేదా అతి తక్కువగ ఉండటం, సులువైన పీఆర్ నిబంధనలు, అద్భుతమైన కెరీర్ అవకాశాలు జర్మనీని బెస్ట్ ఆప్షన్‌గా మార్చేశాయి. పూర్తి వివరాలు..

Published on: Jul 5, 2026, 09:59:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం అనేది దశాబ్దాలుగా ఒక కల. అందులోనూ అమెరికా.. అత్యంత సాంప్రదాయక, అభిమాన వేదికగా నిలిచింది. ప్రపంచ స్థాయి టాప్ యూనివర్సిటీలు, సరళమైన అడ్మిషన్ ప్రాసెస్, కోర్సు పూర్తి కాగానే లభించే అపరిమిత ఉద్యోగాలు, గ్రీన్ కార్డ్ (స్థిరపడటానికి) లభించే స్పష్టమైన మార్గాలు అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి.

భారతీయుల చూపు ఇప్పుడు జర్మనీ వైపు!
భారతీయుల చూపు ఇప్పుడు జర్మనీ వైపు!

అయితే గత కొన్ని ఏళ్లుగా అమెరికాలో పరిస్థితులు మారుతున్నాయి. కఠినమైన వీసా ఆంక్షలు, సుదీర్ఘ వీసా వెయిటింగ్ పీరియడ్, దరఖాస్తుల నిశిత పరిశీలన, కొన్ని యూనివర్సిటీలపై క్రాక్‌డౌన్‌లు, విద్యార్థుల డిపోర్టేషన్ (వెనక్కి పంపడం) వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి తోడు చదువు పూర్తయ్యాక జాబ్ మార్కెట్ తీవ్రంగా క్షీణించింది. హెచ్-1బీ వీసా ఫీజులు భారీగా పెరగడం, పీఆర్ వచ్చే మార్గం అనిశ్చితంగా మారడంతో పాటు విపరీతంగా పెరిగిన ట్యూషన్ ఫీజులు, లివింగ్ కాస్ట్స్ మధ్యతరగతి విద్యార్థులకు భారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇండియన్ స్టూడెంట్స్ ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో 'జర్మనీ' సరికొత్త విద్యా గమ్యస్థానంగా అవతరించింది.

అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంటే, జర్మనీకి వెళ్లే వారి గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోంది. జర్మనీని బెస్ట్ ఆప్షన్‌గా మార్చిన ప్రధాన ప్రయోజనాలు ఇవే:

1. ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు..

ప్రపంచంలోనే అత్యుత్తమ ర్యాంకులు కలిగిన ఎన్నో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు జర్మనీలో ఉన్నాయి. ముఖ్యంగా ఎంబీఏ, ఇంజనీరింగ్, టెక్నాలజీ, స్టెమ్ కోర్సులకు ఇవి పెట్టింది పేరు. జర్మనీలోని కొన్ని టాప్ యూనివర్సిటీలు:

  • టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్
  • హైడెల్బర్గ్ యూనివర్సిటీ
  • లుడ్విగ్-మాక్సిమిలియన్స్-యూనివర్సిటాట్ ముంచెన్
  • ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్
  • ఆర్​డబ్ల్యూటీహెచ్ ఆచెన్ యూనివర్సిటీ
  • కొలోన్ యూనివర్సిటీ

ఈ యూనివర్సిటీలు కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యత ఇస్తాయి. ప్రముఖ గ్లోబల్ కంపెనీలతో వీటికి ఉన్న టై-అప్స్ వల్ల విద్యార్థులు చదువుకుంటూనే ఇంటర్న్‌షిప్స్ ద్వారా ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలు సాధిస్తారు. ఇక్కడి డిగ్రీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

2. ఉచిత విద్య లేదా నామమాత్రపు ఫీజులు..

జర్మనీ విద్యావ్యవస్థలోని అతిపెద్ద ప్లస్ పాయింట్.. అక్కడి పబ్లిక్ యూనివర్సిటీలలో ట్యూషన్ ఫీజులు ఉండవు (లేదా చాలా తక్కువ). విద్యార్థులు కేవలం నామమాత్రపు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అమెరికాలోని యూనివర్సిటీలు ఏడాదికి 25,000 డాలర్ల నుంచి 50,000 డాలర్ల లేదా అంతకంటే ఎక్కువ ట్యూషన్ ఫీజు వసూలు చేస్తాయి. ఈ కోణంలో చూస్తే, జర్మనీలో చదవడం వల్ల భారతీయ విద్యార్థులకు లక్షలాది రూపాయలు ఆదా అవుతాయి. కొన్నిసార్లు భారతదేశంలోని ప్రీమియర్ విద్యాసంస్థల కంటే కూడా ఇక్కడ ఖర్చు తక్కువ కావడం గమనార్హం.

3. విద్యార్థులకు అద్భుతమైన స్కాలర్‌షిప్‌లు..

జర్మనీలో చదవాలనుకునే విద్యార్థులు ప్రముఖ 'డీఏఏడీ' (జర్మన్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్) స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ వస్తే వసతి, ప్రయాణ ఖర్చులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల భారం తప్పుతుంది. విద్యార్థులు పూర్తి వివరాల కోసం డీఏఏడీ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (www.daad.in) సందర్శించవచ్చు. ఇవే కాకుండా 'డ్యూచ్‌ల్యాండ్‌స్టిపెండియం' వంటి ప్రభుత్వ, ప్రైవేట్, యూనివర్సిటీ ఫండెడ్ స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

4. అందుబాటులోనే జీవన వ్యయాలు..

జర్మనీలో విద్యార్థుల నెలవారీ జీవన వ్యయం వారు ఉండే నగరాన్ని బట్టి సగటున 800 నుంచి 1,200 యూరోల (సుమారు రూ. 72,000 నుంచి రూ. 1,08,000) మధ్య ఉంటుంది. నగర శివార్లలో ఉన్నప్పటికీ, జర్మనీలోని అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థ వల్ల ప్రయాణం చాలా సులువుగా, చౌకగా సాగుతుంది.

బ్లాక్డ్ అకౌంట్ :

జర్మనీ వీసా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు విద్యార్థులు తమ పేరిట ఉన్న ఒక ప్రత్యేక 'బ్లాక్డ్ అకౌంట్'లో 11,904 యూరోలు జమ చేయాల్సి ఉంటుంది. జర్మనీ చేరుకున్నాక విద్యార్థి తన నెలవారీ అవసరాల కోసం ఈ ఖాతా నుంచి ప్రతి నెలా 992 యూరోల చొప్పున ఒక సంవత్సరం పాటు డ్రా చేసుకోవచ్చు. ఇది విద్యార్థుల ఆర్థిక భద్రతకు జర్మన్ ప్రభుత్వం ఇచ్చే భరోసా.

5. పార్ట్​ టైమ్ ఉద్యోగాలు..

అంతర్జాతీయ విద్యార్థులు జర్మనీలో చదువుకుంటూనే ఏడాదికి 140 పూర్తి రోజులు లేదా 280 హాఫ్ డేలు పార్ట్ టైమ్ పని చేసుకోవడానికి చట్టబద్ధమైన అనుమతి ఉంది. దీని ద్వారా వచ్చే ఆదాయంతో విద్యార్థులు తమ నెలవారీ జీవన వ్యయాలను సులువుగా వెళ్లదీయవచ్చు.

6. కోర్సు తర్వాత అపారమైన ఉద్యోగావకాశాలు..

జర్మనీ అనేది ఐరోపాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. బీఎండబ్ల్యూ, అడిడాస్, ఎస్ఏపి, సీమెన్స్, అలియాంజ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు ఇది పుట్టినిల్లు. ప్రస్తుతం జర్మనీలో నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అన్వేషణ కోసం జర్మన్ ప్రభుత్వం 18 నెలల జాబ్ సీకర్ వీసా అందిస్తుంది. ఇక్కడ మంచి శాలరీ ప్యాకేజీలతో పాటు కెరీర్ గ్రోత్ బాగుంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఉద్యోగం లభించిన కేవలం రెండు సంవత్సరాల లోపే పీఆర్ కోసం దరఖాస్తు చేసుకునే సువర్ణావకాశం జర్మనీ కల్పిస్తోంది.

భాష సమస్య కాదా?

ప్రస్తుతం జర్మనీలో మెజారిటీ కోర్సులను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తున్నారు. కాబట్టి జర్మన్ భాష రాకపోయినా చదువుకోవచ్చు. అయితే, స్థానిక ప్రజలతో కలవడానికి, పార్ట్ టైమ్ ఉద్యోగాలు సులభంగా సాధించడానికి, త్వరగా సెటిల్ అవ్వడానికి బేసిక్ జర్మన్ భాష నేర్చుకోవడం అదనపు ప్రయోజనకరంగా ఉంటుంది.

భారతీయ విద్యార్థులు జర్మనీని ఎంచుకోవచ్చా?

ప్రపంచ స్థాయి ఉచిత విద్య, సురక్షితమైన వాతావరణం, విద్యార్థులకు లభించే రవాణా/ఆహార డిస్కౌంట్లు, ఉన్నతమైన జీవన ప్రమాణాలు, చదువు కాగానే పీఆర్ పొందే సులువైన మార్గం.. ఇవన్నీ జర్మనీని బెస్ట్ ఆప్షన్‌గా నిలబెడుతున్నాయి. కాబట్టి, భారీ ఖర్చులతో కూడిన అమెరికా లేదా ఇతర దేశాలతో పోలిస్తే, తక్కువ బడ్జెట్‌లో స్థిరపడాలనుకునే భారతీయ విద్యార్థుల టాప్ లిస్టులో జర్మనీ ఖచ్చితంగా ఉండదగిన దేశం.

-గోపాల్ గిడ్వాని, ఫ్రీలాన్స్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ రైటర్.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More