US Tourist Visa : యూఎస్ వీసా నిరీక్షణలో హైదరాబాద్ టాప్.. అపాయింట్‌మెంట్‌కే ఏకంగా 9.5 నెలల టైమ్!
US tourist visa Hyderabad : భారతీయ పర్యాటకులకు యూఎస్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కొరత మళ్లీ ముంచుకొచ్చింది. హైదరాబాద్, ముంబై కాన్సులేట్లలో టూరిస్ట్ వీసా సగటు వెయిటింగ్ టైమ్ ఏకంగా 9.5 నెలలకు పెరిగినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు..
US visa wait time India : అమెరికా పర్యటనకు వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారతీయ పర్యాటకులకు యూఎస్ విదేశాంగ శాఖ షాకిచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని అమెరికా కాన్సులేట్లలో టూరిస్ట్, బిజినెస్ వీసాల (బీ1/బీ2) ఇంటర్వ్యూల వెయిట్ టైమ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నగరాల్లో ఈ నిరీక్షణ కాలం గరిష్ట స్థాయికి చేరింది. తాజా నివేదిక ప్రకారం, ఈ రెండు నగరాల్లో వీసా ఇంటర్వ్యూ స్లాట్ దొరకాలంటే సగటున 9.5 నెలల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది! దీనివల్ల రాబోయే రోజుల్లో అమెరికా వెళ్లాలనుకునే వారు కనీసం ఏడాది ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది.

వివిధ నగరాల్లో ఇంటర్వ్యూ వెయిట్ టైమ్ ఇలా..
హైదరాబాద్- 9.5 నెలలు
ముంబై- 9.5 నెలలు
దిల్లీ- 7.5 నెలలు
చెన్నై- 5.5 నెలలు
కోల్‌కతా 4- నెలలు
ఈ జాబితాలో కోల్‌కతా కాన్సులేట్ మాత్రమే కొంత ఊరటనిస్తోంది. అక్కడ గతంలో 4.5 నెలలుగా ఉన్న వెయిటింగ్ టైమ్ ఇప్పుడు 4 నెలలకు తగ్గింది. మిగిలిన అన్ని నగరాల్లోనూ డిమాండ్ విపరీతంగా పెరగడంతో క్యూ లైన్లు పొడవుగా మారుతున్నాయి. గ్లోబల్ వైడ్‌గా చూసుకుంటే కెనడాలోని టొరంటో (21 నెలలు), ఒట్టావా (14 నెలలు), బొగోటా (11 నెలలు) తర్వాత అత్యధిక నిరీక్షణ సమయం ఉన్న నగరాలుగా హైదరాబాద్, ముంబై నిలిచాయి.
స్టూడెంట్, వర్క్ వీసాల పరిస్థితి ఏంటి?
టూరిస్ట్ వీసాల (బీ1/బీ2) పరిస్థితి ఇలా ఉంటే, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు (ఎఫ్, ఎం, జే వీసాలు), ఉద్యోగులకు (హెచ్-1బీ, ఎల్-1 వీసాలు) మాత్రం పెద్దగా ఇబ్బందులు లేవు. విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు హైదరాబాద్, ముంబైలలో కేవలం 1.5 నెలల్లోనే లభిస్తున్నాయి. అలాగే హెచ్-1బీ వంటి వర్క్ వీసాల అపాయింట్‌మెంట్లు ముంబైలో 1.5 నెలలు, హైదరాబాద్‌లో 3.5 నెలల వ్యవధిలోనే దొరుకుతున్నాయి.
ముందే బుక్ చేసుకున్న వారికి ఛాన్స్ ఉందా?
ఈ నిరీక్షణ సమయం అనేది అప్లికేషన్ ఫీజు చెల్లించిన రోజు నుంచి ఇంటర్వ్యూ తేదీ వరకు ఉండే సగటు కాలం మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. అయితే, కాన్సులేట్లు ఎప్పటికప్పుడు అదనపు ఇంటర్వ్యూ స్లాట్లను విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని చాలా లాంగ్ డేట్ వచ్చిన వారు.. వీసా షెడ్యూలింగ్ పోర్టల్‌ను నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలి. కొత్త స్లాట్లు ఓపెన్ అయినప్పుడు లేదా ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్నప్పుడు తమ అపాయింట్‌మెంట్‌ను ముందస్తు తేదీకి రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రీమియం స్లాట్ల పైలట్ ప్రాజెక్ట్!
మరోవైపు, వీసా వెయిటింగ్ పీరియడ్‌ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం ఒక కొత్త పైలట్ ప్రోగ్రామ్‌ను కూడా పరిశీలిస్తోంది. దీని ప్రకారం సాధారణ వీసా ఫీజు 185 డాలర్లకు అదనంగా మరో 750 డాలర్లు (సుమారు రూ. 62,000) చెల్లిస్తే.. 10 పనిదినాల్లోనే ఇంటర్వ్యూ స్లాట్ కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రీమియం సర్వీస్ ఏయే కాన్సులేట్లలో అందుబాటులోకి వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


