ఏఐ కోసం మెటా భారీ వ్యూహం: 115 మిలియన్ డాలర్లతో ఉచిత శిక్షణ, ఉద్యోగం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం మెటా సంస్థ సరికొత్త శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 115 మిలియన్ డాలర్ల వ్యయంతో అమెరికాలో ఉచిత కోర్సులు అందిస్తూ, పూర్తి చేసిన వారికి వంద శాతం ఉద్యోగ భద్రత కల్పిస్తోంది.

Published on: Jun 9, 2026, 11:29:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ మాతృసంస్థ 'మెటా' (Meta) మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగా తన డేటా సెంటర్ల నిర్మాణానికి అవసరమైన నైపుణ్యం గల కార్మికులను తయారు చేసేందుకు 115 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 960 కోట్లు) వ్యయంతో ఒక ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించింది. ఐదు వారాల పాటు సాగే ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ వంద శాతం ఉద్యోగ గ్యారెంటీ ఇస్తుండటం విశేషం.

ఏఐ కోసం మెటా భారీ వ్యూహం: 115 మిలియన్ డాలర్లతో ఉచిత శిక్షణ, ఉద్యోగం
ఏఐ కోసం మెటా భారీ వ్యూహం: 115 మిలియన్ డాలర్లతో ఉచిత శిక్షణ, ఉద్యోగం

ఏంటి ఈ 'అమెరికాస్ వర్క్‌ఫోర్స్ అకాడమీ'?

కమర్షియల్ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ 'సీబీఆర్ఈ' (CBRE), అసోసియేటెడ్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ భాగస్వామ్యంతో మెటా ఈ 'అమెరికాస్ వర్క్‌ఫోర్స్ అకాడమీ'ని ప్రారంభించింది. ప్రస్తుతం అమెరికాలో నైపుణ్యం ఉన్న సాంకేతిక కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరతను అధిగమించడానికి ఎలక్ట్రికల్ పనులు, హెచ్‌వీఏసీ (HVAC) ఇన్‌స్టాలేషన్, వెల్డింగ్, ప్లంబింగ్, ఫైబర్-ఆప్టిక్ టెక్నాలజీ వంటి రంగాలలో ఈ అకాడమీ శిక్షణ ఇస్తుంది.

కోర్సు పూర్తి చేసిన వారికి నేషనల్ సెంటర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఎడ్యయ్కేషన్ అండ్ రీసెర్చ్ నుంచి గుర్తింపు పొందిన సర్టిఫికేట్‌తో పాటు 'అమెరికాస్ వర్క్‌ఫోర్స్ సర్టిఫికేట్' లభిస్తుంది. అనంతరం, మెటాకు చెందిన డేటా సెంటర్ నిర్మాణ ప్రాజెక్టులలో జనరల్ కాంట్రాక్టర్ల వద్ద వీరికి నేరుగా ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ప్రాథమికంగా లూసియానా, ఒహియో, ఇండియానా, టెక్సాస్ రాష్ట్రాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

హైపీరియన్ డేటా సెంటర్.. డిమాండ్‌కు అసలు కారణం

మెటా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం ఆ సంస్థ నిర్మిస్తున్న భారీ మౌలిక సదుపాయాలే. లూసియానాలోని రిచ్‌ల్యాండ్ పారిష్‌లో మెటా నిర్మిస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ 'హైపీరియన్' వైశాల్యం దాదాపు మ్యాన్‌హట్టన్ నగరంలో సగం భాగాన్ని ఆక్రమించేంత భారీగా ఉంటుంది. ఇంతటి భారీ నిర్మాణాలకు వేలాది మంది నిపుణులైన కార్మికులు అవసరం అవుతారు.

అసోసియేటెడ్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అంచనాల ప్రకారం, డేటా సెంటర్ల నిర్మాణం పుంజుకోవడంతో కేవలం ఈ ఏడాదిలోనే నిర్మాణ రంగంలో అదనంగా 3,49,000 మంది కొత్త కార్మికుల అవసరం ఏర్పడింది. గత రెండేళ్లలో డేటా సెంటర్లకు సంబంధించిన నిర్మాణ ఉద్యోగాల ప్రకటనలు రెట్టింపు అయ్యాయని లేబర్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ 'లైట్‌కాస్ట్' విశ్లేషించింది.

కోడింగ్ కంటే బ్లూ-కాలర్ ఉద్యోగాలకే మొగ్గు

సాంకేతిక రంగంలో సాధారణంగా సాఫ్ట్‌వేర్ స్కిల్స్, కంప్యూటర్ సైన్స్ విద్యకే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తుంటాయి. అయితే, భౌతిక మౌలిక సదుపాయాల నిర్మాణానికి కూడా అంతే నైపుణ్యం గల మానవ వనరులు అవసరమని మెటా గుర్తించింది. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఫైబర్ ఇన్‌స్టాలేషన్ శిక్షణా కార్యక్రమానికి కేవలం మొదటి ఏడు రోజుల్లోనే 35,000 దరఖాస్తులు రావడం దీనికి నిదర్శనం.

ఏఐ ఆధారిత డేటా సెంటర్ల నిర్మాణ జోరు ఎంతలా ఉందంటే, దీని పెట్టుబడులు 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని మెకిన్సే సంస్థ అంచనా వేసింది. మెటాతో పాటు బ్లాక్‌రాక్ ఫౌండేషన్ కూడా టెక్సాస్‌లో ఎలక్ట్రీషియన్ల శిక్షణ కోసం 100 మిలియన్ డాలర్ల కార్యక్రమాన్ని ప్రకటించింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన వలస విధానాల వల్ల నిర్మాణ రంగంలో నైపుణ్యం గల కార్మికుల కొరత మరింత పెరిగిందని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ పేర్కొంది.

వేతనాల ఆకర్షణ.. ఉద్యోగాల భద్రత

"చాలామంది అమెరికన్లు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మంచి జీతం వచ్చే ఉద్యోగం కోసం శిక్షణ పొందాలి, కానీ శిక్షణ సమయంలో జీతం రాకపోతే ఇల్లు గడవడం కష్టం. ఈ సమస్యను పరిష్కరించడానికే స్టైపెండ్‌తో కూడిన అప్రెంటిస్‌షిప్, విలువైన సర్టిఫికేషన్ అందిస్తూ నేరుగా ఉద్యోగం వచ్చేలా ఈ కార్యక్రమం తోడ్పడుతుంది," అని అమెరికా మాజీ వాణిజ్య కార్యదర్శి జీనా రైమొండో ఈ పథకం ప్రాధాన్యతను వివరించారు. ప్రస్తుతం డేటా సెంటర్ టెక్నీషియన్లు ఏడాదికి సగటున 88,000 డాలర్లు (సుమారు రూ. 73 లక్షలు) సంపాదిస్తున్నారు.

అయితే, నిర్మాణ రంగ ఉద్యోగాలు తాత్కాలిక స్వభావాన్ని కలిగి ఉంటాయనే ఆందోళన కూడా ఉంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత శాశ్వత ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మెటా నివేదిక ప్రకారం, డేటా సెంటర్ల ద్వారా 47 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు, 6,97,000 శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి మెటా అందిస్తున్న సర్టిఫికేషన్ కార్మికులకు ఇతర నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ సులభంగా ఉద్యోగాలు పొందేలా సహాయపడుతుంది.

వైట్-కాలర్ కోతలతో బ్లూ-కాలర్ పెట్టుబడులు

ఒకవైపు బ్లూ-కాలర్ కార్మికులకు శిక్షణ ఇస్తూనే, మరోవైపు మెటా తన వైట్-కాలర్ (సాఫ్ట్‌వేర్) ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులు సమకూర్చడం కోసం ఇటీవల కంపెనీ 8,000 మంది ఉద్యోగులను తొలగించింది. రోజువారీగా 350 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్న మెటా, భవిష్యత్తులో మానవ పనుల భారాన్ని తగ్గించి ఏఐ ఏజెంట్ల ద్వారానే మెజారిటీ పనులను పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి అవసరమైన భౌతిక కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే మాత్రం మనుషుల శ్రమ తప్పనిసరి. ఆ ఖాళీని పూరించడానికే మెటా ఈ అకాడమీని వేదికగా చేసుకుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More