...
...
Next Story

ఆర్ఆర్ఆర్ నార్త్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 161 కిలోమీటర్లు 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే!

RRR Hyderabad latest news : ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం పనులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 2 ప్యాకేజీలతో బిడ్ల దాఖలుకు టెండర్ల ఆహ్వానం పలికారు

Published on: May 21, 2026, 05:36:27 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర రవాణా రంగాన్ని మలుపు తిప్పే రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో ఉన్న ఐదు ప్యాకేజీల విధానాన్ని సవరించి, ఈసారి కేవలం రెండు ప్యాకేజీలతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సరికొత్త టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ ప్రతిష్టాత్మక 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును దాదాపు రూ. 9,362.4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.

రూట్ మ్యాప్, ప్యాకేజీల వివరాలు

సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్‌పల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర ఈ ఉత్తర భాగం విస్తరించనుంది. ఈ రహదారిని 'NH-161AA' గా నోటిఫై చేశారు. పనులను వేగవంతం చేసేందుకు NHAI దీనిని రెండు ప్రధాన ప్యాకేజీలుగా విభజించింది.

ప్యాకేజీ-1 (83.518 కి.మీ.): సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుండి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు పనులు జరుగుతాయి. దీని అంచనా వ్యయం రూ. 4,918.71 కోట్లు.

ప్యాకేజీ-2 (78 కి.మీ.): ప్రజ్ఞాపూర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్‌పల్లి వరకు రహదారిని నిర్మిస్తారు. దీని అంచనా వ్యయం రూ. 4,443.69 కోట్లు.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ప్రయాణం అత్యంత సుగమం కానుంది. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలను చేపట్టనున్నారు. పెద్ద వంతెనలు 44, చిన్న వంతెనలు 127, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు 4, అండర్‌పాసులు 44, కల్వర్టులు 1,262, టోల్‌ప్లాజాలు 9 నిర్మించనున్నారు.

ప్యాకేజీ-1 పరిధిలో 927.84 హెక్టార్లు, ప్యాకేజీ-2లో 886.54 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 70 శాతానికి పైగా భూములకు పరిహారం ప్రకటించగా, మిగిలినవి చివరి దశలో ఉన్నాయి.

2029 నాటికి అందుబాటులోకి

గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. 2024లో మొదట 4 వరుసల రహదారిగా భావించినా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 2025లో దీనిని 6 వరుసల రహదారిగా మార్చారు. గతంలో సాంకేతిక కారణాల వల్ల టెండర్లు దాఖలు కాకపోవడంతో, ఈసారి NHAI అన్ని డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో పక్కాగా అప్‌లోడ్ చేసింది. ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకపోతే 2029 నాటికి ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ రీజినల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా సంగారెడ్డి, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, భువనగిరి ప్రాంతాల మధ్య రవాణా సులువవడమే కాకుండా, ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం, పారిశ్రామిక కారిడార్లు ఊపందుకోనున్నాయి.

  • మొత్తం పొడవు 161.518 కిలోమీటర్లు
  • రహదారి రకం 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
  • మొత్తం బడ్జెట్ (సివిల్) రూ. 9,362.4 కోట్లు
  • నిర్మాణ విధానం DBOT (యాన్యుటీ / హైబ్రిడ్ యాన్యుటీ)
  • మొత్తం భూసేకరణ సుమారు 1,814.38 హెక్టార్లు
  • కనెక్టివిటీ 9 ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks