Telangana : అక్రమ నిల్వలపై ఉక్కుపాదం - రూ. 66కే కిలో బీపీటీ బియ్యం! కీలక ఆదేశాలు
తెలంగాణలో బియ్యం ధరలను అదుపు చేసేందుకు సివిల్ సప్లైస్ శాఖ చర్యలు చేపట్టింది. సాధారణ బీపీటీ బియ్యం గరిష్ఠ ధరను కిలోకు రూ.66గా ఖరారు చేసిన ప్రభుత్వం…. బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై కేసులు నమోదు చేసి విస్తృత దాడులు నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్య వినియోగదారులకు ఉపశమనం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించే వ్యాపారులు, రైస్ మిల్లర్లపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అక్రమ నిల్వలు (హోర్డింగ్), బ్లాక్ మార్కెటింగ్ మరియు ఎక్కువ ధరలకు విక్రయించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ధరల నియంత్రణకుగానూ ప్రత్యేక నిఘా, టాస్క్‌ఫోర్స్ తనిఖీలను విస్తృతం చేసినట్లు మంత్రి తెలిపారు.

ధరల నియంత్రణపై ఫోకస్….
బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావడంలో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులు హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్లు మరియు రైస్ మిల్లర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ చర్చల ఆధారంగా, వినియోగదారులు ఎక్కువగా వాడే 'బిపిటి' (BPT) రకం బియ్యం గరిష్ఠ ధరను కిలోకు రూ. 66గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 'ఆర్ఎన్ఆర్' రకం బియ్యం ధరను దాని నాణ్యత, ఉత్పత్తి వ్యయాన్ని బట్టి త్వరలోనే సమీక్షించి నిర్ణయిస్తామని చెప్పారు.
"సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుని దందాలు చేసేవారిని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదు. మార్కెట్లో ధరలు స్థిరపడేవరకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి," అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాపారులను హెచ్చరించారు.
పౌరసరఫరాలు, పోలీస్, జీఎస్టీ (GST), లీగల్ మెట్రాలజీ, సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారులతో కూడిన 5 శాఖల ఉమ్మడి బృందాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపడుతున్నాయి. అక్రమంగా ధాన్యం నిల్వ చేయడం…. నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు అమ్మడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన బియ్యం వ్యాపారులపై ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశారు.
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రధాన హోల్‌సేల్ కేంద్రాలైన బేగం బజార్, నాంపల్లి, మహారాజ్‌గంజ్ పరిధిలో విస్తృత దాడులు సాగాయి. రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లోనూ ఈ తనిఖీలను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తదితర ఉన్నతాధికారులు తాజా ఎన్ఫోర్స్మెంట్ వివరాలను మంత్రికి నివేదించారు. రాష్ట్రంలో సరిపడా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురై అనవసరంగా పెద్దమొత్తంలో బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ద్వారా ప్రభుత్వం రేషన్ షాపుల్లో అందిస్తున్న సన్న బియ్యాన్ని నిరభ్యంతరంగా వినియోగించుకోవాలని కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

