గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా 'వీబీజీ రామ్‌ జీ' స్కీమ్ అమలు చేయాలి - సీఎం చంద్రబాబు

పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు.

Published on: Jan 11, 2026, 05:15:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు... గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ నెలలో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్(గ్రామీణ్)- వీబీ జీ రామ్ జీ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలన్నారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

శనివారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, జనసేన తరపున మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జీ రామ్ జీ పథకం అమలు పైనా... ఈ పథకం ద్వారా రాష్ట్రానికి... పేదలకు ఎలాంటి మేలు జరుగుందన్న అంశంపై చర్చించారు.

పేదలకు మరింత ఉపాధి - సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని తెచ్చింది. కొత్త మార్గదర్శకాల ద్వారా గతాని కంటే 25 రోజులు ఎక్కువగా పేదలకు ఉపాధి కల్పించే అవకాశం లభించింది. దీంతో పాటు.. రైతులకు, వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా చూసేలా నిబంధనలు విధించింది. దీని వల్ల అటు కూలీలకు.. ఇటు రైతులకు మేలు జరిగేలా చూసింది" అని చెప్పారు.

"ఇప్పటి వరకు నరేగా పనుల్లో టీడీపీ హయాంలో మాత్రమే ఆస్తుల కల్పన జరిగింది. నరేగా పనుల్లో భాగంగా సుమారు 25 వేల కిలో మీటర్ల మేర రోడ్లు వేశాం. కానీ గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గ్రామాల్లో ఆస్తుల కల్పనను నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు జీ-రామ్-జీ పథకాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా గ్రామాల్లో వివిధ రకాల వసతులు కల్పించవచ్చు. నరేగా పథకంతో పోలిస్తే... జీ-రామ్-జీ స్కీంలో అదనంగా ఇంకొన్ని పనులు చేసుకునే వెసులుబాటు ఉంది. సోలార్ లైటింగ్ సిస్టం ఏర్పాట్లను ఈ స్కీం పరిధిలోకి తెచ్చారు. ఇలాంటి వాటి వల్ల గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరుతాయి”అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

“రాష్ట్రాన్ని 10 సూత్రాల ఆధారంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా పని చేస్తోంది. ఇప్పుడు నిర్దేశించుకున్న 10 సూత్రాల అమలుకు జీ-రామ్-జీ స్కీం ఉపయోగపడుతుంది. ఆయా సూత్రాల అమలుకు జీ-రామ్-జీ స్కీంలోని అంశాలు ఏ మేరకు ఉపకరిస్తాయో విశ్లేషించుకుని ప్రణాళికలు రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయగలుగుతాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

“ఈ స్కీంలో భాగంగా గ్రామాల్లో గోకులాలు నిర్మించుకోవచ్చు... ప్లాంటేషన్ చేసుకోవచ్చు... పశు గ్రాసం పండించుకుని ఉపాధి కల్పించవచ్చు. అలాగే ప్రతి ఇంటికి తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార వంటి పథకాలను ఈ స్కీంకు అనుసంధానం చేయవచ్చు. పాఠశాలలు, ఆస్పత్రులు, కమ్యూనిటీ సెంటర్లు ఇలాంటి వాటిని నిర్మించుకోవడం లేదా రిపేర్లు చేసుకోవడం వంటి వాటి ద్వారా ఆస్తులను మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

“ప్రణాళికబద్దంగా వెళ్లడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను ఈ స్కీం ద్వారా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో గ్రామ వికాసం సాధ్యమవుతుంది. గ్రామ సభల్లో ఏయే పనులు చేపట్టాలనే అంశంపై ఆమోదం తీసుకోవాలి. అలాగే ఏయే రోజుల్లో పనులు చేపట్టాలనే విషయం మీద కూడా గ్రామ సభల్లో చర్చించి... గ్రామస్థుల సూచనలను పరిగణనలోకి తీసుకుని నోటిఫై చేయాలి. అలాగే జీ రామ్ జీ స్కీం కింద ఎలాంటి పనులు చేపడుతున్నామనే విషయాన్ని ఆన్ లైన్లో పొందుపరచాలి. ప్రణాళిక బద్దంగా వికసిత భారత్, స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాలు నెరవేరుతాయి” అని సీఎం చంద్రబాబు వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More