నీళ్ల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు..? - సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు గొడవలు కాదు తెలుగు జాతి ప్రయోజనాలు కావాలన్నారు. సముద్రంలోకి వెళ్లే నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు? అని వ్యాఖ్యానించారు.
ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని... రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో తాజా పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

“గతంలో విద్యుత్ భారం అంతా ప్రజల నెత్తిన ట్రూ ఆప్ ఛార్జీల పేరిట వేశారు. మేం ట్రూ డౌన్ అని కరెంటు బిల్లుల భారం తగ్గించాం. రూ.4500 కోట్లు పెంచుకోమని ఈఆర్సీ అనుమతి ఇస్తే ప్రజలపై భారం వద్దని.. ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచబోమని మరోమారు స్పష్టం చేస్తున్నా. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు పేరిట సుపరిపాలన అందించేలా కార్యాచరణ రూపోందించాం. వాట్సప్ గవర్నెన్సు ద్వారా పౌరసేవలన్నీ సులభతరం చేశాం. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో గూగుల్ విశాఖకు వస్తోంది. 2027 మార్చిలోగా పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం" అని ప్రటించారు.
"పోలవరాన్ని ఒక యజ్ఞంగా భావించి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం. గత పాలకులు వరదల్లో ప్రాజెక్టులు ముంచేసి ధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్లతో డయాఫ్రం వాల్ మళ్లీ కట్టాల్సి వస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేయటమే నా లక్ష్యం”అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
వివాదాలు వద్దు - సీఎం చంద్రబాబు
“ఏటా 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇందులో 200 టీఎంసీలు వాడుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు. సముద్రంలోకి వెళ్లే నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు? నీళ్లు వద్దు గొడవలే కావాలని కొందరు బయల్దేరారు. కొందరు రాయలసీమ ఎత్తిపోతల అంటూ వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు గొడవలు కాదు తెలుగు జాతి ప్రయోజనాలు కావాలి. పోలవరం పూర్తి అయితే నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. వివాదాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అందరికీ చెబుతున్నాను"అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"పట్టిసీమ కట్టి కృష్ణా డెల్టాలో వినియోగించుకుందామంటే వ్యతిరేకించారు. కృష్ణా డెల్టాలో ఇచ్చే నీళ్లను పొదుపు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించాం. ఈ ఏడాది రాయలసీమలోని రిజర్వాయర్లలో నీళ్లు నింపాం. గతంలో ఆ ప్రాంతంలో వేసిన వేరు శనగ పంట ఎండిపోయిన పరిస్థితి. ప్రస్తుతం రాయలసీమ నీటి కొరత తీర్చి ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దున్నాం. కొందరు నీళ్లు వద్దు వివాదాలే కావాలని నానా యాగీ చేస్తున్నారు”అని సీఎం అన్నారు.
సుస్థిరమైన పాలన ఉంటేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఐదేళ్లకు ఓ మారు ఒకర్ని మార్చేద్దామని అనుకుంటే నష్టమే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ వివాదాలు పరిష్కరించడానికి రెండేళ్లు పట్టిందని వివరించారు. “2021లోనే పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు 2027లో పూర్తి అవుతోంది. అమరావతిది కూడా అదే పరిస్థితి. ఆ ప్రాజెక్టునూ ఇబ్బందులు పెట్టారు. మొన్నటి వరకూ మూడు ముక్కలాట ఆడారు. మూడు రాజధానులని అన్నారు. ప్రజలు గుణపాఠం చెప్పినా అర్ధం కావటం లేదు. రాజ్యాంగంలో రాజధాని అని ఎక్కడా పేరు లేదని చెబుతున్నారు. బెంగుళూరు ప్యాలెస్ లోనూ, ఇడుపులపాయలోనే కూర్చొంటే అదే రాజధానా...? ఈ చాదస్తం ఏమిటి ఎవరికీ అర్ధం కావటం లేదు” అని చంద్రబాబు కామెంట్స్ చేశారు.
"నదిపక్కన రాజధాని కడుతున్నారని మాట్లాడుతున్నారు. విజయవాడ, రాజమండ్రి, విశాఖ, లండన్, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు ఎక్కడున్నాయి.? ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నారు. పీపీపీ మెడికల్ కాలేజీలపై అందరినీ బెదిరిస్తున్నారు. రహదారులు పీపీపీల ద్వారానే వస్తున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టును మేం పూర్తి చేస్తుంటే అది నాదే అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుంటే.. భరించలేక ఆరోపణలు చేస్తున్నారు. భోగాపురం పీపీపీ అయితే అది ముద్దు... కానీ పీపీపీ కింద మెడికల్ కాలేజీలు కడితే వద్దంటున్నారు”అని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

