విడతల వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్.... పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణ లేదు - సీఎం రేవంత్ రెడ్డి
పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. విద్యార్థులు ఎవరి చేతుల్లోనో పావులుగా, కీలుబొమ్మలుగా మారొద్దని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు.
విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, పాలిటెక్నిక్ విద్యలో తీసుకొచ్చిన మార్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు.. వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టమైన వివరణ ఇచ్చారు. పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విద్యార్థులు ఎవరి చేతుల్లోనో పావులుగా, కీలుబొమ్మలుగా మారొద్దని కోరారు. ముందు యుగం దూతలుగా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

విడతలవారీగా చెల్లింపులు - సీఎం రేవంత్
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, నిజాయితీగా వివరాలందించిన కాలేజీల రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారిగా చెల్లిస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వం విద్యా రంగానికి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందో సభలో వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. సభ్యులు లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానమిచ్చారు.
ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలను విద్యాశాఖ పరిధి నుంచి స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీయడానికి కాదని, వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకేనని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికీ అనుమానాలుంటే సభ్యులు, నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చర్యలు చేపట్టి సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
“తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించేందుకు కే కేశవరావు నేతృత్వంలో కమిటీని నియమించాం. సభ్యులు, విద్యా రంగ నిపుణులు ఎవరైనా తమ సూచనలు, సలహాలను కమిటీకి అందిస్తే వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని సీఎం ప్రకటించారు.
2023-24లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయించగా.. తమ ప్రభుత్వం 2024-25లో రూ.21,292 కోట్లు కేటాయించామన్నారు. 2025-26లో రూ.23,108 కోట్లకు, 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచామని పేర్కొన్నారు. కేవలం మూడేళ్లలోనే విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.7,554 కోట్ల మేర పెంచాం” అని ముఖ్యమంత్రి సభ ముందు వివరించారు.
“తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేవలం 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించింది” అని సీఎం పేర్కొన్నారు.
“జెన్ జీ ఒక్కటే కాదు. రానున్న జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తున్నాం. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.. తలరాతలను మార్చేది విద్య” అనే నమ్మకంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నా. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తెలంగాణకు తీసుకొచ్చేందుకు, దేశానికి తెలంగాణను ఒక రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం” అని అన్నారు.
“పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన జీఓ ఎంఎస్ నెం.97పై కొన్ని వివాదాలు తలెత్తాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. “పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణ అనే ప్రసక్తే లేదు” అని సభలో స్పష్టం చేశారు.
"ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు ఇకపై కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయి. కేవలం సాంకేతిక విద్యా వ్యవస్థను స్కిల్స్ యూనివర్సిటీ పరిధితో అనుసంధానం చేస్తున్నాం. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి టాటా సంస్థ సహకారంతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. అంతమాత్రాన ఐటీఐలను ప్రైవేటు పరం చేసినట్లు కాదు. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్‌షిప్ అందించాలని నిర్ణయించాం” అని చెప్పారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ లెక్కలు...
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో స్పష్టత ఇచ్చారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5,435 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వదిలివెళ్లిందని తెలిపారు. అందులో గత ప్రభుత్వం పెట్టిన బకాయిల నుంచి రూ.1,410 కోట్లు తమ ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ.1,465 కోట్లను చెల్లించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం చెల్లించిన వాటితో కలిపి మొత్తంగా 32 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.3,488 కోట్లు చెల్లించినట్లు సభలో వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఖాతాల్లోకి డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కోసం అడ్వాన్స్‌గా గ్రీన్ చానెల్‌లో డబ్బు చెల్లిస్తున్నామని చెప్పారు. బకాయిల విషయంలో విజిలెన్స్ నివేదికను పరిశీలించిన తర్వాత నిజాయితీగా ఉన్న వాటన్నింటినీ బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

