కృష్ణా నీటి వాటాపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపించండి - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయమైన వాటా సాధించేందుకు సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిండి, అచ్చంపేట ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

Published on: Nov 11, 2026, 06:02:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణ రక్షిత నీటి హక్కులను పరిరక్షించేందుకు, రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో అత్యంత సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న అన్ని రకాల జల వివాదాలపై పక్కా ఆధారాలు…. స్పష్టమైన గణాంకాలను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఈనెల 18వ తేదీన విచారణ…

ఈ నెల 18వ తేదీ తర్వాత సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదంపై కీలక విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు న్యాయ నిపుణులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారుతో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరోవైపు పాలమూరు పరిధిలోని డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని ఇంజినీర్లను సీఎం ఆదేశించారు. గతంలో నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి, అచ్చంపేట పథకాలకు సాగునీరు అందించాలని స్పష్టం చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎక్కడ టన్నెల్ నిర్మించాలి, ఎక్కడ కాలువ తవ్వాలనే అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి తక్షణమే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేయాలని, దానికి అనుగుణంగా పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించారు. "గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదు, ప్రతి విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి" అని సూచించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీఎంసీల నీటినే పూర్తిగా తరలించలేని పరిస్థితి నెలకొన్నందున….. అదనపు టీఎంసీ పనులపై బాధ్యతాయుతంగా ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. అలాగే కేంద్ర జల సంఘం నుంచి అవసరమైన అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు సాధించడంతో పాటు పక్కాగా డీపీఆర్ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More