కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి.. ఐదు గంటల్లోనే నీటి సరఫరా పునరుద్ధరణ

హైదరాబాద్ ఉప్పల్ బాగాయత్ సమీపంలో కారు ఢీకొని ఎయిర్ వాల్వ్ ధ్వంసమైన విషయం తెలిసిందే. భారీగా నీటి లీకేజీ జరగ్గా.. వెంటనే అప్రమత్తమైన జలమండలి అధికారులు మరమ్మతులు పూర్తి చేశారు.

Published on: Oct 20, 2026, 12:53:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్‌-2కు సంబంధించిన ఎయిర్ వాల్వ్ ప్రమాదవశాత్తు ధ్వంసం కావడంతో ఏర్పడిన భారీ నీటి లీకేజీని జలమండలి అధికారులు అత్యంత వేగంగా అరికట్టారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి కేవలం ఐదు గంటల్లోనే మరమ్మతులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.

కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి
కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి

ఈ ఉదయం 4 గంటల సమయంలో ఉప్పల్ బాగాయత్ సమీపంలోని నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద ప్రధాన రహదారికి సుమారు 20 అడుగుల దూరంలో కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్‌కు సంబంధించిన ఎయిర్ వాల్వ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీని రక్షణ కోసం నిర్మించిన ఇనుప కంచెను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రక్షణ కంచెతో పాటు ఎయిర్ వాల్వ్ కూడా పూర్తిగా దెబ్బతినడంతో భారీగా నీటి లీకేజీ ఏర్పడింది. ఈ ఘటనలో హయత్‌నగర్‌కు చెందిన వినీత్ అనే 24 ఏళ్ల వ్యక్తి మరణించాడు.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు సంబంధిత పంపులను నిలిపివేసి నీటి ప్రవాహాన్ని నియంత్రించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి దెబ్బతిన్న ఎయిర్ వాల్వ్‌ను మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు.

ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు, సాంకేతిక సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. అవసరమైన యంత్ర సామగ్రి, సాంకేతిక సిబ్బందిని సమీకరించి నిరంతరాయంగా మరమ్మతు పనులు కొనసాగించారు. దెబ్బతిన్న ఎయిర్ వాల్వ్ వ్యవస్థను కేవలం ఐదు గంటల్లోనే పునరుద్ధరించి, లీకేజీని పూర్తిగా అరికట్టారు. అనంతరం పైప్‌లైన్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి సంబంధిత ప్రాంతాలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.

పండుగ సందర్భంగా నగరవాసులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం ఏర్పడినప్పటికీ, అధికారులు, సిబ్బంది పండుగను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా శ్రమించి మరమ్మతులను సకాలంలో పూర్తి చేశారు. తద్వారా తాగునీటి సరఫరాలో అంతరాయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలిగారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, అత్యంత సమన్వయంతో రికార్డు సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసిన ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పండుగ సమయంలోనూ ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ, అంకితభావంతో విధులు నిర్వర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది ఇదే విధమైన అప్రమత్తత, సమన్వయం, వేగవంతమైన స్పందనతో పనిచేయాలని సూచించారు.

ప్రజలకు నిరంతరాయంగా తాగునీటిని అందించడమే జలమండలి ప్రథమ ప్రాధాన్యమని, సరఫరా వ్యవస్థలో అనుకోని సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని ఎండీ స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More