ఎన్‌డీఎస్‌ఏ పర్యవేక్షణలోనే కాళేశ్వరం పనులు - నీటి ఎత్తిపోతలపై సీఎం కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఎన్‌డీఎస్ఏ పర్యవేక్షణలోనే పునరుద్ధరణ చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. గోదావరి నదిలో నీళ్లు పారినంత మాత్రాన ఎత్తిపోయడానికి వీలుకాదని చెప్పారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) పర్యవేక్షణలో అందించే సిఫారసులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, డిజైన్లు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో గేట్లు మూసి బ్యారేజీల్లో నీటిని నిలువచేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని ఎన్‌డీఎస్ఏ సూచనల మేరకే నీటిని ఎత్తిపోయడం లేదని చెప్పారు.

శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి….. కాళేశ్వరం ప్రాజెక్టు - మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వచేసి ఎత్తిపోయడానికి వీలులేని పరిస్థితులు, ఎన్ డీఎస్ఏ నివేదిక అంశాలను సమగ్రంగా వివరించారు.
“కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధరించే విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2026 జూన్ 30 న టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీని నియమించింది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, పునరుద్ధరణ అంశాలపై ఆ కమిటీ ప్రతిపాదనలకు లోబడి జరగాలని నిర్ధేశించారు.
ఎన్‌డీఎస్ఏ (టెక్నికల్) సభ్యుడు చైర్మన్‌గా, సీడబ్ల్యూసీ (డిజైన్స్ – బీసీడీ) డైరెక్టర్, సీడబ్ల్యూసీ (డిజైన్ – గేట్స్) డైరెక్టర్, ఎస్ఎంఆర్ఎస్ నుంచి ఎస్ఈ స్థాయికి తగ్గకుండా ఒక ప్రతినిధి, సీడబ్ల్యూపీఆర్ఎస్ నుంచి ఎస్ఈ స్థాయికి తగ్గకుండా ఒక ఇంజినీర్, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎస్ఈ స్థాయికి తగ్గకుండా ముగ్గురు ప్రతినిధులు ఉండే విధంగా టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ తెలంగాణ ప్రభుత్వ నిపుణులు, ఈ రంగంలో జాతీయ అంతర్జాతీయ నిపుణులతో పాటు ఇతరేతర నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుంటుందని ఆ కమిటీని నియమిస్తూ జలశక్తి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను నిర్దేశించింది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
“ఎన్‌డీఎస్ఏ తుది నివేదికను పరిగణలోకి తీసుకుని టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ సూచనలను తూ.చ తప్పకుండా పాటించి అందుకు అనుగుణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
“ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీల్లో నీటిని నిలువచేయడానికి ఏమాత్రం సహేతుకం కాదని ఎన్‌డీఎస్‌ఏ తన నివేదికలో చాలా స్పష్టంగా తెలిపింది. ప్రస్తుత సమస్యలతో పాటు పరిష్కారానికి అవసరమైన సూచనలు అన్నీ చేసింది.. అని చెప్పారు. ఆ నివేదికను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టును పునరుద్ధరించడానికి నిపుణుల కమిటీ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది” అని అన్నారు.
నీరు పారుతున్నప్పటికీ గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయడం లేదని, ఆ విషయంలో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని, బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నందునే ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేస్తున్నాం అని వివరించారు. ఈ విషయంలో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపిస్తూ, ఎన్‌డీఎస్‌ఏ సూచనలను పరిగణలోకి తీసుకుని మాట్లాడితే బాగుండేదని వ్యాఖ్యానించారు.
“గోదావరి నదిలో నీళ్లు పారినంత మాత్రాన ఎత్తిపోయడానికి వీలుకాదు. అందుకు బ్యారేజీలు ఏమాత్రం అనుకూలం కాదు. నీటిని ఎత్తిపోయాలంటే ముందు నీటిని నిల్వచేయాలి. నిలువ చేయకుండా నీటిని ఎత్తిపోయడానికి అవకాశమే లేదు. పారుతున్న గోదావరి నుంచి నీటిని ఎత్తిపోయడానికి బ్యారేజీలు ఎందుకు….? అని ప్రశ్నించారు.
“దేశంలోని ప్రాజెక్టులు, డ్యామ్‌ల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 30 న పార్లమెంట్ ద్వారా డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ను తెచ్చింది. ఈ అథారిటీ దేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే డ్యామ్‌ల తనిఖీలు, పర్యవేక్షణ, నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి తగిన యంత్రాంగంతో చట్టం రూపొందించారు. ఇలాంటి సందర్భాల్లో ఏ రాష్ట్రమైనా ఎన్‌డీఎస్ఏ ఆదేశాలు, సూచనలు పాటించాల్సిందే. 2023 లో మేడిగడ్డ ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే ఎన్‌డీఎస్‌ఏ పర్యటించి ప్రాథమిక నివేదిక అందించింది. ఆ తర్వాత పూర్తి స్థాయి నివేదికను అందించింది" అని సీఎం గుర్తు చేశారు.
"మేడిగడ్డ 7వ బ్లాక్ వద్ద బ్యారేజీ పిల్లర్లు 1.2 మీటర్లు కుంగిపోయింది. ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాల కారణంగానే ఆ ప్రమాదం ఏర్పడిందని చాలా స్పష్టంగా నివేదికలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యారేజీల్లో నీటిని నింపితే ప్రమాదకరమని ఎన్‌డీఎస్ఏ తన 365 పేజీల నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఎన్‌డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలలో నీటిని నింపడానికి పనికి రావు. మేడిగడ్డ 7వ బ్లాక్ డ్యామేజీ కావడం వల్ల మొత్తం బ్యారేజీపై ప్రభావం చూపించి దెబ్బతిన్నదని, ఆ కారణంగా నీటి నిల్వ సాధ్యం కాదని తేల్చింది. ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి మూడు బ్యారేజీల స్థిరీకరణ, పునరుద్ధరణకు, సమగ్రమైన అంచనాలు అవసరమని ఎన్‌డీఎస్ఏ తన ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో తేల్చిచెప్పింది. మొత్తం ప్రాజెక్టు పునరుద్ధరించాలంటే డిజైన్లు, మరమ్మతులు ఎన్‌డీఎస్ఏ లేదా సీడబ్ల్యూసీ ఆమోదంతో మాత్రమే చేయాలని స్పష్టంగా చెప్పింది” అని ముఖ్యమంత్రి స్పష్టంగా వివరించారు.
“నీటిని ఎత్తిపోయడానికి పంపులు పనిచేయాలంటే మేడిగడ్డ బ్యారేజీ వద్ద 93.5 మీటర్ల మేరకు నీటిని నింపాలి. అప్పుడే పంపులకు నీటిని నింపడానికి వీలవుతుంది. నీటిని ఎత్తిపోయడానికి నిరంతరంగా ఆ స్థాయిలో బ్యారేజీలో నీటిని నిలువ చేయాలి. కనీసం 5 టీఎంసీల నీటిని నింపినప్పుడే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారంలో పోయాలి.
బ్యారేజీల్లో నీటిని నిలువ చేయాలంటే గేట్లు మూయాలి. గేట్లు మూస్తే మొత్తం బ్యారేజీకే ప్రమాదం పొంచి ఉందని ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరించింది. పైగా బ్యారేజీ గేట్లపైన హైడ్రాలిక్ ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి లేనందున, మరమ్మత్తులు చేసే వరకు గేట్లు మూయొద్దని, అన్ని గేట్లను ఎత్తిపెట్టాలని ఎన్‌డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది” అని తెలిపారు.
“గేట్లు మూయలేని పరిస్థితి ఉన్నప్పుడు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు అన్నారం నుంచి తిరిగి మేడిగడ్డకే చేరుకుంటాయే తప్ప ప్రయోజనం లేదు. అన్నారం 116.5మీటర్ల ఎత్తున నిల్వచేసి ఎత్తి, సుందిళ్లలో పోస్తే సుందిళ్ల బెడ్ లెవల్ 126.5 మీటర్లు మేరకు దాదాపు 20 మీటర్ల ఎత్తు నీటిని నిల్వచేయాలి.
ఇలా ఒకదానిపై ఇంకొకటి ఆధారపడి, నీటిని నిల్వ చేయకుండా ఎత్తిపోయడం అసలు సాధ్యం కాదు. గేట్లు మూసి నీటిని నిల్వచేయడం వల్ల ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం ఉండొచ్చు. భద్రాచలం పట్టణం వరదలతో ముంచెత్తవచ్చు. ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది” అని హెచ్చరించారు.
“నిజానికి ఈ ప్రాజెక్టుకు ప్రాణవాయువు…. గుండెకాయ శ్రీపాద ఎల్లంపల్లి. గుండెకాయతో ఇప్పుడు ప్రాజెక్టు సాగుతోంది. 2019 జూన్ 21 న కాళేశ్వరం ప్రారంభిస్తే, ప్రాజెక్టు పూర్తి కాకముందే, 2020 మే 18 ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇందులో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దకుండా నిర్మాణాలు చేపడితే బ్యారేజీకే ప్రమాదం ఉందని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి లేఖ రాశారు. ప్రాజెక్టును ప్రారంభించిన 11 నెలల్లోనే లోపాలు ఉన్నాయని తెలిపారు” అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
“ఆ లోపాలను సరిదిద్దకపోవడం, పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగా మేడిగడ్డ కుప్పకూలింది. దీనికి ముందు 2022 జూలై 14 న గోదావరి పోటెత్తిన సమయంలో రిటెయినింగ్ వాల్ కూలి కన్నెపల్లి పంప్‌హౌజ్ పూర్తిగా మునిగిపోయి దెబ్బతిన్నది. ఆ పంప్‌హౌజ్‌ను ఇప్పటికీ నూటికి నూరు శాతం సరిదిద్దలేదు. మేడిగడ్డ కుంగిపోయిన మరుసటిరోజున మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కూడా చేయబడింది. 2023 అక్టోబర్ 22 న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు పరిస్థితిని పరిశీలించి ప్రాజెక్టు డిజైన్, ప్లానింగ్, నాణ్యత, నిర్మాణం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలను ఎత్తిచూపుతూ ఆ కారణంగానే మేడిగడ్డ కుంగిపోయిందని ప్రాథమిక నివేదిక అందించారు” అని సీఎం చెప్పారు.
“ప్రాజెక్టు పునరుద్ధరణకు నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ, ఎన్‌డీఎస్ఏ సిఫారసులను పాటించాలన్న సూచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వారి పర్యవేక్షణలో ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాం. నిపుణుల పర్యవేక్షణలో ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రాజెక్టు పునరుద్ధరణ విషయంలో మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ నెలలో టెస్టింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ముంబయ్ ఐఐటీ, అంతర్జాతీయ నిపుణుల సూచనల మేరకు పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తాం. ఈ విషయంలో ఎన్‌డీఎస్ఏకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

