KLIS Barrages : మొత్తం మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల ఆపరేటింగ్ - మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
కాళేశ్వరం బ్యారేజీల్లో వంద శాతం మరమ్మతులు పూర్తయి, ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీల అనుమతులు వచ్చాకే వాటిని పునరుద్ధరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
రాష్ట్ర ప్రజల భద్రత, సాగునీటి ప్రాజెక్టుల రక్షణ విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీలను పూర్తిగా పునరుద్ధరించి.. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) స్వతంత్రంగా అనుమతులు మంజూరు చేసిన తర్వాతే వాటిని ఆపరేట్ చేస్తామని ఆయన ప్రకటించారు.

నాగార్జునసాగర్ డ్యామ్ సమీపంలోని విజయ్ విహార్‌లో శనివారం సీనియర్ ఇంజనీర్లతో కలిసి నీటిపారుదల పనులపై మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాలు, ప్రదర్శనల కంటే భద్రత, స్థిరత్వం, ప్రజా ఆస్తుల రక్షణే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని తేల్చిచెప్పారు.
"కావాల్సిన ప్రతి ఒక్క మరమ్మతు పూర్తి కాకుండా ఈ బ్యారేజీల నుంచి నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదు. పునరుద్ధరణ ప్రణాళికలను ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీలు నిశితంగా పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది," అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం బారేజీల కోసం రూ. 1.1 లక్షల కోట్లకు పైగా ప్రజాధనాన్ని పెట్టుబడిగా పెట్టారని….. తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ప్రతి రూపాయిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తుచేశారు.
నిపుణుల అనుమతులు లేకుండా బాధ్యతారహితంగా… ముందస్తుగా బారేజీలను ఆపరేట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అవసరమైన మరమ్మతులు పూర్తి చేయకుండా గేట్లు మూసి నీటిని నిల్వ ఉంచితే, దిగువన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం పట్టణంతో పాటు దాదాపు 40 గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
శాస్త్రీయ పద్ధతిలో పునరుద్ధరణ పనులు
బ్యారేజీల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అత్యంత శాస్త్రీయమైన విధానాన్ని అవలంబిస్తోందని మంత్రి వివరించారు. దీనికోసం సరికొత్త జియోటెక్నికల్ పరిశోధనలు, నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) సర్వేలు, డ్రోన్ ఆధారిత అధ్యయనాలు నిర్వహించామన్నారు.
నిర్మాణాల పరిస్థితిని అంచనా వేయడానికి 100 కి పైగా బోర్‌హోల్స్ తవ్వినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సుల మేరకు బారేజీలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా (అన్‌లోడెడ్ కండిషన్) అన్ని గేట్లను తెరిచే ఉంచినట్లు తెలిపారు. అంతర్జాతీయ నిపుణులు, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS), కేంద్ర జల సంఘం సంయుక్తంగా ఈ రీహ్యాబిలిటేషన్ డిజైన్లను పరిశీలిస్తున్నాయని, సాంకేతిక లోపాలన్నింటినీ సరిదిద్దిన తర్వాతే బారేజీలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
నాగార్జునసాగర్ నిర్వహణపై ప్రత్యేక ఫోకస్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రత, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సకాలంలో నిర్వహణ పనులు చేపట్టాలని, కాలువల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పనులకు సంబంధించిన అంచనాలను వెంటనే సిద్ధం చేసి పరిపాలనా అనుమతుల కోసం పంపాలన్నారు.
అంతకుముందు….. మిర్యాలగూడలో ఎగుమతి ఆధారిత ఆధునిక రైస్ మిల్లును మంత్రి ప్రారంభించారు. తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను బలోపేతం చేయడానికి… రైతులకు మెరుగైన ధరలు కల్పించడానికి ప్రపంచ స్థాయి రైస్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. అనంతరం గూళ్లపోతులగండి ఎత్తిపోతల పథకాన్ని తనిఖీ చేసి, 12,239 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలన్నారు. అలాగే 5,895 ఎకరాలకు నీరందించే కేశవాపూర్ ఎత్తిపోతల పథకం, నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులతో పాటు ఎన్‌ఎస్‌పీ ప్రధాన కాలువ పురోగతిని సమీక్షించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

