సిరిసిల్ల.. ఉరిసిల్లగా మారింది.. గడీల మీద గురిపెడదాం : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల.. ఉరిసిల్లగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుందని ఆరోపణలు చేశారు.

Published on: Sep 30, 2026, 20:58:31 IST
By , Siricilla
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాల వల్లే సిరిసిల్ల ప్రాంతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, కేసీఆర్ కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతకుముందు సీఎం రేవంత్ సిరిసిల్లలో పాదయాత్ర చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సిరిసిల్ల పాత బస్టాండ్ నేతన్న విగ్రహాం మీదుగా పాదయాత్ర సాగింది.

సిరిసిల్లలో రేవంత్ రెడ్డి పాదయాత్ర
సిరిసిల్లలో రేవంత్ రెడ్డి పాదయాత్ర

సిరిసిల్ల అంటే సంపదకు, చేనేత కళకు నిలయమని, అలాంటి ప్రాంతాన్ని గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉరిసిల్లగా మార్చారని సీఎం మండిపడ్డారు. చేనేత, గీత కార్మికుల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఆత్మహత్యలు, వలసలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ కార్మికులు మరణిస్తే వారి మృతదేహాలను స్వదేశానికి తెచ్చేందుకు కూడా గత పాలకులు సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని, సిరిసిల్ల ప్రజల ఓట్లను సొమ్ము చేసుకుని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రపంచంలోనే ధనవంతుడిగా నిజాం నవాబుకు పేరుంటే, నేడు కేసీఆర్ కుటుంబం వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుని విలాసవంతమైన జీవితం గడుపుతోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లు, మానేరు ఇసుక దోపిడీ ద్వారా కేటీఆర్, సంతోష్‌రావు వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేనేత కార్మికుల కోసం రూ.2,234 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, తమ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే రూ.1,731 కోట్లు కేటాయించిందని సీఎం వివరించారు. అంతేకాకుండా ఈ జిల్లా అభివృద్ధి కోసం రూ.1,700 కోట్ల నిధులను అందించామని తెలిపారు.

2009 నుంచి ఆరుసార్లు గెలిపించినా సిరిసిల్ల ప్రజలకు కేటీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో సిరిసిల్లలోని గడీలను బద్దలు కొట్టి, కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. అలాగే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి వర్గానికి చెందిన అభ్యర్థిని గెలిపించి మండలికి పంపాలని కోరారు.

ఈ ప్రజాపాలన బహిరంగ సభలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More