స్కూల్ విద్యార్థుల యూనిఫాం కలర్, డిజైన్‌లో మార్పులు - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంల రంగులు మరింత ఆకర్షణీయంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజైన్లలో వైవిధ్యం తీసుకురావాలని సూచించారు. వచ్చే ఏడాది విద్యాసంవత్సరం తొలిరోజే సామగ్రి అందించాలని స్పష్టం చేశారు.

Published on: Sep 20, 2026, 05:12:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, వసతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫారాలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని…. వాటి డిజైన్లలో కొత్తదనంతో పాటు వైవిధ్యం తెచ్చేందుకు ప్రయత్నించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. పాఠశాల విద్యార్థులకు అందజేసే పాఠ్య సామగ్రి, యూనిఫాంల పంపిణీ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూళ్లలోని పిల్లలందరికీ ఇప్పటికే ఒక జత యూనిఫాం పంపిణీని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. రెండవ జత యూనిఫాంను కూడా ఈ నెలాఖరు నాటికి విద్యార్థులందరికీ అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే కేజీబీవీ (KGBV), మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంలను అందించినట్లు వివరించారు.

యూనిఫాంలతో పాటు విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాల పంపిణీ ప్రక్రియ కూడా వంద శాతం పూర్తయిందని అధికారులు సమావేశంలో తెలియజేశారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్స్, కేజీబీవీలు మరియు మోడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులతో పాటు కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్ల పంపిణీని కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం అందజేసిన యూనిఫాంలు, ఇతర వస్తువుల నాణ్యతపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పూర్తి సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

తొలిరోజే యూనిఫాంలు - సీఎం ఆదేశాలు

సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తొలి రోజే విద్యార్థులందరికీ యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రి అందేలా ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నందున… ప్రస్తుతం ఉన్న ప్రవేశాల కంటే అదనంగా కనీసం 10 శాతం మంది విద్యార్థులు కొత్తగా చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ సంఖ్యకు తగినట్లుగా పంపిణీ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More