...
...
Next Story

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా స్కీమ్ ప్రారంభం

సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంతేకాదు జిల్లాలో రూ.544.11 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు.

Updated on: Nov 19, 2026, 19:30:57 IST
Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటన చేశారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా విద్య, విద్యుత్, రెవెన్యూ రంగాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ రూ. 544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ. 451.13 కోట్లతో చేపట్టనున్న నూతన పనులకు శంకుస్థాపన చేయగా, ఇప్పటికే పూర్తయిన రూ. 92.98 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.

సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి

అనంతరం సిద్దిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. కోటికి పైగా పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు రూపొందించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ దరఖాస్తుల నమోదు ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి మెుదలుపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా లభించనుంది. ఇప్పటివరకు వివిధ శాఖల పరిధిలో నేతన్నలు, గీత కార్మికులు, మత్స్యకారులు తదితరులకు అందుతున్న రూ. 2 లక్షల బీమాను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ బీమా పథకం అమలు కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. నెల రోజుల పాటు కొనసాగే ఈ నమోదు ప్రక్రియ కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆఫ్‌లైన్ కేంద్రాలతో పాటు ప్రత్యేక మొబైల్ యాప్, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

దౌల్తాబాద్ మండలంలో రూ. 7.80 కోట్లు, చిన్నకోడూరు మండలంలో రూ. 7.50 కోట్ల వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం చేసేందుకు శంకుస్థాపనం చేశారు.

నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చిన పలు కీలక భవనాలు, సదుపాయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రూ. 54.67 కోట్లతో 14 నూతన సబ్‌స్టేషన్లు ప్రారంభించారు. కొమురవెల్లి ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యార్థం ఆలయ సత్రం రూ. 14.35 కోట్లు, క్యూ కాంప్లెక్స్ రూ. 12 కోట్లతో నిర్మించారు. దీనిని సీఎం ప్రారంభించారు. వీటితోపాటుగా మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks