ఎర్రవల్లి భూముల్లో 45 ఎకరాలు మిస్సింగ్.. అక్కడే అమరవీరుల కాలనీ : సీఎం రేవంత్ రెడ్డి
ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రెండు గ్రామాల్లో సర్వే వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూములకు సంబంధించి తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ రికార్డులకు, క్షేత్రస్థాయి పరిశీలనకు మధ్య భారీ తేడా కనిపించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే సర్వే నోటిఫికేషన్ జారీ చేసి మిస్సింగ్ భూముల వివరాలు తేల్చాలని ఆదేశించారు.

ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో ఉన్న భూములపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించారు. సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి నమోదు అయి ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 343 ఎకరాలు మాత్రమే కనిపిస్తోంది. మిగిలిన 45 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డుల నుంచి మాయమైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ 45 ఎకరాల భూమి ఎక్కడ ఉంది? ఎవరి ఆక్రమణలో ఉంది? అనే అంశంపై కచ్చితమైన విషయాలు తేల్చి చెప్పాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ భూముల సరిహద్దుల లొకేషన్‌ను స్పష్టం చేసేందుకు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో రీ-సర్వే నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేశారు.
సర్వే నంబర్ 325 పరిధిలోని భూముల సరిహద్దుల్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్, ఆయన కుటుంబ సభ్యుల భూములు విస్తరించి ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వివాదాలు లేకుండా స్పష్టత తెచ్చేందుకు గాను, తమ వద్ద ఉన్న భూమి రెవెన్యూ రికార్డులు, డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా కేసీఆర్ కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.
పొరుగున ఉన్న భూ యజమానులకు కూడా సర్వే నోటిఫికేషన్ ఆధారంగా ముందస్తు సమాచారం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్వే నంబర్ 325లో తేలిన ప్రభుత్వ భూమిని తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం సకల సౌకర్యాలతో తెలంగాణ అమరవీరుల కాలనీగా ఈ భూమిని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అర్హులైన అమరుల కుటుంబాలకు ఇక్కడ ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు మిగిలిన సర్వే నంబర్ భూమిని స్థానిక పేద రైతులకు కేటాయించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మోడల్ కాలనీ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసి అర్హులకు ఇళ్లను అందజేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన గడువు విధించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములపై గతంలోనూ కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి భూముల లెక్క తేల్చాలని ఆదేశించడం, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


