ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారు - ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన… ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పేరు మార్పు విషయంలో కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గ్రామీణ పేదల పని హక్కును హరించి… పెద్ద పెద్ద కార్పొరేట్లకు కార్మికులు అందుబాటులో ఉండేలా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విబీజీఆర్ఏఎంజీని ఏర్పాటు చేసిందని ఆరోపించారు.

గురువారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతో మంది పేదలకు ఆసరాగా నిలిచిందని గుర్తు చేశారు. వలసలు, వెట్టి చాకిరీని నిర్మూలించటంలో కీలక పాత్ర పోషించిందన్నారు. గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించిందని వివరించారు.
మోదీ కుట్ర చేస్తున్నారు - సీఎం రేవంత్
"నేడు, అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలకు కార్మికులు అందుబాటులో లేరు. గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఏ రద్దుచేస్తే, గ్రామీణ పేదలు మళ్లీ పట్టణాలకు వలస వెళతారు. పేదలు మళ్లీ పట్టణాలకు వచ్చినప్పుడు అదానీ, అంబానీలకు కూలీలు అందుబాటులోకి వస్తారు. పేద కూలీలను బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వంటి కంపెనీలకు బానిసలుగా చేసి… వెట్టి కార్మికులుగా మార్చడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడానికి నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నారు" అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏ రీతిలో అయితే పోరాడారో… అదే తీవ్రతతో ఈ పేదల వ్యతిరేక చట్టాలను ప్రతిఘటిస్తామని చెప్పారు. ఈ 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) ఎక్కడ ఉంది? 'మీరు (మోదీ) సంక్షోభ భారతాన్ని సృష్టిస్తున్నారు. పేద వెట్టిచాకిరి కార్మికులను, బానిసలుగా మార్చడానికి మీరు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, పేదలను ఓటు హక్కును హరించడానికి… వారు పెద్ద కార్పొరేట్లకు లోబడి ఉండేలా చూడటానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరిట కుట్ర చేస్తున్నారు" రేవంత్ రెడ్డి ఆరోపించారు.
“మహాత్మాగాంధీ పేరుతో నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం పేరు మార్చి, ఉద్దేశాన్ని నీరుగార్చి పేదలకు అన్యాయం చేస్తోంది. ఈ పథకాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యచరణ తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించాం. ఈ పథకంలో మార్పులను నిరసిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ పథకాన్ని యదాతథంగా పునరుద్ధరించాలన్న డిమాండ్ తో ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని నిర్ణయించాం. ఫిబ్రవరి మూడు నుండి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

