దీపావళి పండగ వేళ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం లబ్ధిదారులతో కలిసి ఆదివారం దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని పర్సాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అదే ఇంట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలసి భోజనం చేశారు. లబ్ధిదారుడి కుటుంబ సభ్యులతో ముచ్చటించి, కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
జీవిత కాలపు జ్ఞాపకం - సీఎం రేవంత్
“కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో గోరిపల్లి సుమిత్ర–శ్రీనివాస్ దంపతులు నూతననంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించాను. కొత్త ఇంట్లో వారికి పట్టు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపాను. నా జన్మదినం రోజున ఆ ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొనడం, వారి సంతోషాన్ని పంచుకోవడం నాకు జీవిత కాలపు జ్ఞాపకం” అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియంను సీఎం ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా దుద్యాలలో సమీకృత మండల కార్యాలయ భవనాన్ని, దౌల్తాబాద్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. అలాగే కొడంగల్‌లో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ భవనాలతో పాటు హకీంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పిహెచ్సి) ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు…
మరోవైపు షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలతో కలసి పండుగ జరుపుకున్నారు.