Medaram Jatara 2026 : మేడారంలో 3 ఆస్పత్రులు, 30 మెడికల్ క్యాంపులు..! 3 వేల మంది సిబ్బందితో వైద్య సేవలు

మేడారం జాతరకు వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 3 హాస్పిటళ్లు, 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనుంది.అంతేకాకుండా జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులను అందుబాటులో ఉంచనుంది.

Published on: Jan 10, 2026, 16:01:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే జాతర కోసం వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. మేడారంలో 3 హాస్పిటళ్లు, 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనుంది.అంతేకాకుండా జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులను అందుబాటులో ఉంచనుంది.

మేడారంలో 3 హాస్పిటళ్లు.. 30 మెడికల్ క్యాంపులు
మేడారంలో 3 హాస్పిటళ్లు.. 30 మెడికల్ క్యాంపులు

మేడారం జాతరలో అందించే వైద్య సేవలపై ఉన్నతాధికారులతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు.

ఇప్పటికే లక్షల మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గద్దెల వద్ద, జంపన్న వాగు సమీపంలో, ఆర్టీసీ బస్‌ స్టాండ్ వద్ద 3 వైద్య శిబిరాలను ప్రారంభించామని అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున జాతర పరిసరాలలో మరిన్ని మెడికల్ క్యాంపులను ముందస్తుగానే ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు. భక్తులు మేడారం బయలుదేరిన దగ్గరి నుంచి.. అమ్మవార్లను దర్శించుకుని క్షేమంగా ఇళ్లకు చేరేంత వరకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మేడారం చేరుకునే అన్ని రూట్లలోనూ మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

50 పడకల ప్రధాన హాస్పిటల్….

జాతరలో అత్యవసర వైద్య సేవల కోసం మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో కూడిన ప్రధాన హాస్పిటల్ (శ్రీ సమ్మక్క సారలమ్మ వైద్యశాల) ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీనికి అదనంగా జంపన్న వాగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద 6 పడకల సామర్థ్యంతో రెండు మినీ హాస్పిటళ్లు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

8 రూట్లలో క్యాంపులు….

వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చే 8 ప్రధాన రూట్లలో, ఎక్కడా వైద్య సేవలకు లోటు రాకూడదని మంత్రి దామోదర సూచించారు. ఇందుకోసం 42 ఎన్‌-రూట్‌ (En-route) మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హనుమకొండ - మేడారం రూట్‌లో అత్యధికంగా 9 క్యాంపులు, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే భక్తుల కోసం 6 క్యాంపులు, భద్రాచలం రూట్‌లో 5 క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

3,199 మందితో సేవలు…

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భారీగా వైద్య సిబ్బందిని మోహరించాలని మంత్రి ఆదేశించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి మొత్తం 3,199 మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇందులో 72 మంది స్పెషలిస్టులు, 42 మంది లేడీ డాక్టర్లతో కలిపి 544 మంది వైద్యులు విధుల్లో ఉంటారు. వీరికి తోడుగా 2,150 మంది పారామెడికల్ సిబ్బంది (నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు) షిఫ్టుల వారీగా 24 గంటల పాటు సేవలు అందించనున్నారు.

అత్యవసర సేవలకు 35 అంబులెన్సులు

గుండెపోటు, ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్లో చికిత్స అందించేలా 35 అంబులెన్సులను సిద్ధం చేశామని ధికారులు తెలిపారు. మెరుగైన వైద్యం అవసరమైతే పేషెంట్లను ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు, వరంగల్ ఎంజీఎంలకు తరలించాలని మంత్రి సూచించారు. ఈ రెండు హాస్పిటళ్లలో నెల రోజుల పాటు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

చిన్నపిల్లల మందుల దగ్గరి నుంచి పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ల వరకు 248 రకాల మందులు, సర్జికల్ సామాగ్రిని ద్వారా ముందస్తుగానే సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే జనవరి 25వ తేదీ నుంచి అన్ని వైద్య శిబిరాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. తక్షణమే మేడారం వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్‌‌ నాయక్‌ను మంత్రి ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More