Telangana : ఓటర్ల నమోదుకు ఈసీ కీలక నిర్ణయం - ఈ తేదీల్లో ప్రత్యేక క్యాంపులు..!

Telangana Voter Registration Special Camps : తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు, మినహాయించిన పేర్ల పరిశీలనకు అక్టోబర్ 15, 16న పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. మరోవైపు నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.

Published on: Oct 14, 2026, 06:03:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Telangana Voter Registration Special Camps : రాష్ట్రంలోని అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా….. జాబితాలో పేర్లు లేని వారు, తొలిసారి ఓటు హక్కు పొందే యువత కోసం అక్టోబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

ఓటర్ల నమోదుకు ఈసీ కీలక నిర్ణయం - ఈ తేదీల్లో ప్రత్యేక క్యాంపులు..!
ఓటర్ల నమోదుకు ఈసీ కీలక నిర్ణయం - ఈ తేదీల్లో ప్రత్యేక క్యాంపులు..!

"అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడం, అర్హత లేని వారి పేర్లను తొలిగించడమే తమ ప్రాథమిక లక్ష్యం," అని సీఈఓ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అధికారులకు ఆయన స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు….

అక్టోబర్ 15, 16 తేదీల్లో ఉదయం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఈ ప్రత్యేక క్యాంపులు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు (తప్పనిసరిగా కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. వారితో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలని సీఈఓ తెలిపారు. అర్హులైన యువత, ఇప్పటివరకు పేరు నమోదు చేసుకోని వారు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి 'ఫారం-6' పూరించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

తొలగించిన ఓట్లపై ఇంటింటి సర్వే….

గతంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సమయంలో తొలగించిన పేర్లను పునఃపరిశీలించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. ఈ క్రమంలో బీఎల్‌ఓలు పాత జాబితాను… ప్రస్తుత జాబితాతో పోల్చి చూస్తారు. గతంలో పేరు ఉండి, ప్రస్తుత జాబితాలో లేని ఓటర్ల వివరాలతో ప్రత్యేక జాబితాను రూపొందిస్తారు.

అనంతరం ఈ వివరాల ఆధారంగా బీఎల్‌ఓలు సంబంధిత ఇళ్లకు వెళ్లి నేరుగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. సదరు వ్యక్తి అక్కడ నివసిస్తూ, ఓటు హక్కుకు అర్హుడిగా తేలితే తక్షణమే 'ఫారం-6' ద్వారా దరఖాస్తు పూర్తి చేయిస్తారు. కొత్త ఓటర్లు, యువతకు కూడా ఇదే తరహాలో సహాయం అందిస్తారు. సేకరించిన సమాచారాన్ని, దరఖాస్తులను క్షేత్రస్థాయి నివేదికతో సహా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు సమర్పిస్తారు.

రాజకీయ పార్టీలకు జాబితాల అందజేత

ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత, పోలింగ్ బూత్‌ల వారీగా సిద్ధం చేసిన ఈ జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇఆర్‌ఓలు అందిస్తారు. దీనివల్ల అర్హులైన వారు ఎవరైనా మిగిలిపోతే, వారిని కూడా ఓటర్లుగా నమోదు చేయించేందుకు రాజకీయ పార్టీలకు మరో అవకాశం లభిస్తుంది.

రాత్రి నివాస కేంద్రాలు, కార్మిక కాలనీలు, నిరాశ్రయులు, వెనుకబడిన వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక బూత్ స్థాయి క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, యువత అధిక సంఖ్యలో ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు.

ఎన్నికల సంఘం కమ్యూనికేషన్ ప్లాన్ అమలులో భాగంగా ప్రతిరోజూ క్యాంపుల పురోగతిని సోషల్ మీడియాలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఓలు, తొలిసారి ఓటు హక్కు పొందుతున్న యువకుల అనుభవాలు, ఫొటోలు, వీడియో క్లిప్‌లను జిల్లా అధికారులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో రోజువారీగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు స్వీకరించే ఫారం-6 దరఖాస్తులను పరిశీలించి…. నవంబర్ 9న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో చేర్చుతారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More