తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా..! కార్పొరేషన్లలోనూ హవా...!
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగగా… 60కిపైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరోవైపు కార్పొరేషన్లలో కూడా ఆదిపత్యాన్ని ప్రదర్శించింది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరగగా… ఇప్పటికే 64 స్థానాల్లో హస్తం పార్టీ పాగా వేసింది. ఇందులో 1300కుపైగా వార్డులను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్13 మున్సిపాలిటీలకే పరిమితమైంది. దాదాపు 700కిపైగా వార్డుల్లో విజయం సాధించింది.

రాష్ట్రవ్యాప్తంగా 38 మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇక్కడ అటుఇటు సమీకరణాలు మారే అవకాశం ఉంది. వీటిల్లో కొన్ని కాంగ్రెస్, మరికొన్ని బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఒకే మున్సిపాలిటీకి బీజేపీ పరిమితమైంది. నారాయణపేటలో మాత్రమే ఎక్కువ వార్డులను గెలుచుకుంది. భైంసాలో అత్యధికంగా ఎంఐఎం వార్డులను కైవసం చేసుకుంది. మొత్తంగా 256 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
కాంగ్రెస్ ఖాతాలోకి మెజార్టీ మున్సిపాలిటీలు…!
- ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, నేరేడు చర్ల, హుజూర్‌నగర్ లో హస్తం పార్టీ విజయం సాధించింది.
- బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, భూత్పూర్, ధర్మపురి, భీంగల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
- చెన్నూరు, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, సుల్తానాబాద్ లో వికర్టీ కొట్టింది.
- నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోలు-జోగిపేట, సదాశివపేట, రామాయంపేటలో మెజార్టీ వార్డులను గెలుచుకుంది.
- హుజూరాబాద్, కొల్లాపూర్, కల్వకుర్తి, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్‌ఘన్‌పూర్, మధిర, అశ్వారావుపేట, ఇల్లెందు, ములుగు, యాదిగిరి గుట్ట, ఆలేరులోనూ కాంగ్రెస్ హవానే కొనసాగింది.
- చేవెళ్ల, మెయినాబాద్, శంకర్ పల్లి, షాద్ నగర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ వార్డులను గెలిచింది.
ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, ఇంద్రేశం, గుమ్మడిదలలో వికర్టీ కొట్టింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ, మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీలను గెలుచుకుంది. అంతేకాకుండా మూడుచింతలపల్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోగా.. జర్వేల్ లో కూడా విక్టరీ కొట్టింది. కల్వకుర్తి నియోజకరవర్గంలోని ఆమనగల్లులో కూడా విజయం సాధించింది.
కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా…!
ఇక రాష్ట్రంలో 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల్లోనూ కాంగ్రెస్ లీడ్ లో ఉంది. నల్గొండ కార్పొరేషన్‌లోని మొత్తం 48 డివిజన్లకు 27 గెలిచింది. బీఆర్ఎస్-9, బీజేపీ-4, AIFB-4, మజ్లిస్-2, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థికే అవకాశం రానుంది.
- కొత్తగూడెం కార్పొరేషన్ ను సీపీఐ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కొత్తగూడెంలో మొత్తం 47 డివిజన్లు ఉండగా… సీపీఐ 25, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్… సీపీఐకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
- కరీంనగర్ కార్పొరేషన్‍లో మొత్తం 66 డివిజన్లు ఉండగా ఎక్కువ డివిజన్లలో బీజేపీ లీడ్ లో ఉంది. దాదాపు ఇక్కడ మేయర్ ఆ పార్టీ అభ్యర్థే ఉండనున్నారు.
- మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
- మంచిర్యాల కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లలో విజయం సాధించి మరో మూడింట్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
- రామగుండం కార్పొరేషన్‍లో 60 డివిజన్లకు గాను 34 డివిజన్లకు ఫలితాలు వెలువడ్డాయి. అందులో 22 వార్డులలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరికొన్ని డివిజన్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది.
- తాజా లెక్కల ప్రకారం… బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి ఒక్క కార్పొరేషన్ కూడా వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

