మున్సిపల్ ఎన్నికలు : ఈసీ నుంచి అప్డేట్ - అందుబాటులోకి 'టీ-పోల్ మొబైల్ యాప్'..! ఇవిగో వివరాలు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మరోవైపు ఎన్నికలు సజావు జరిగేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా రూపొందించిన ‘TE-Poll’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 30వ తేదీతో నామినేషన్ల గడువు పూర్తవుతుంది. అయితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రూపొందించిన TE-Poll మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
TE-Poll యాప్
ఎన్నికలకు సంబంధించి సమస్యలుంటే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ యాప్ ను తీసుకువచ్చినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అంతేకాకుండా tsec.gov.in ద్వారా కూడా కంప్లైయిట్స్ ఇవ్వొచ్చని సూచించారు.
ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫిర్యాదు చేయటమే కాకుండా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.
' టీ-పోల్ మొబైల్ యాప్'ను ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది.
పోలింగ్ ఎప్పుడంటే…?
మరోవైపు ఫిబ్రవరి 3 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు భారీ బందోబస్తు మధ్య నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు అర్హతలతో పాటు సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి… స్వీకరిస్తున్నారు.
నామినేషన్ల ముగింపు తేదీ-30.01.2026(సాయంత్రం 5:00 గంటల వరకు).
పోలింగ్ తేదీ-11.02.2026 (ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు).
ఓట్ల లెక్కింపు-13.02.2026 (ఉదయం 8:00 గంటల నుంచి ఉంటుంది.