సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం అత్యంత ప్రమాదకర రీతిలో కారును రేసింగ్ ట్రాక్‌లా పరిగెత్తించిన ఒక యువకుడిని సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏకంగా గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో లగ్జరీ కారును నడుపుతూ, ఇతర వాహనదారుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టిన ఈ ఘటన ఇతరులను కూడా ఆందోళనకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌కు చెందిన కొత్తపల్లి యశ్వంత్ రెడ్డి (32) అనే వ్యక్తిని ఈ కేసులో నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
గత మే 10వ తేదీ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదకర స్టంట్ చోటుచేసుకుంది. నిందితుడు యశ్వంత్ రెడ్డి ఇటీవల కొనుగోలు చేసిన ఒక సరికొత్త లగ్జరీ కారుతో (తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ TG TR 2026) ఓఆర్‌ఆర్ ఎంట్రీ నంబర్ 18(A) ద్వారా రింగ్ రోడ్డుపైకి ప్రవేశించాడు. నార్సింగి టోల్ ప్లాజా నుంచి టీజీపీఏ (TGPA) టోల్ ప్లాజా వైపు వెళ్లే మార్గంలో కారు యాక్సిలరేటర్‌ను గట్టిగా నొక్కాడు. చూస్తుండగానే కారు స్పీడోమీటర్ 200 కిలోమీటర్ల మార్కును దాటేసింది.
కారు అంత వేగంతో దూసుకెళ్తుండగా.. యశ్వంత్ రెడ్డి ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని, మరో చేత్తో తన మొబైల్ ఫోన్ ద్వారా స్పీడోమీటర్, రోడ్డును కవర్ చేసేలా వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ ప్రమాదకరమైన వీడియోను తన వ్యక్తిగత ‘యశ్వంత్ రెడ్డి’ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో తోటి వాహనదారులు, సామాన్య ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
కారు సీజ్.. కేసు నమోదు
వైరల్ వీడియోపై స్పందించిన హైవే పెట్రోలింగ్ అధికారి కారింగుల సాయిరాం మే 19న నార్సింగి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
{{/usCountry}}వైరల్ వీడియోపై స్పందించిన హైవే పెట్రోలింగ్ అధికారి కారింగుల సాయిరాం మే 19న నార్సింగి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
{{/usCountry}}ఈ ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 125 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం), సెక్షన్ 281 (ప్రజా మార్గంలో నిర్లక్ష్యంగా వాహనం నడపడం) కింద క్రైమ్ నంబర్ 396/2026 గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాలు, సదరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా యొక్క డిజిటల్ ఫుట్‌ప్రింట్లను ట్రాక్ చేసిన పోలీస్ దర్యాప్తు బృందం… యశ్వంత్ రెడ్డిని పట్టుకుంది. విచారణలో నిందితుడు తాను ఏప్రిల్ 2026లో కారు కొనుగోలు చేశానని…. కేవలం సోషల్ మీడియాలో క్రేజ్ కోసమే మే 10న ఈ స్టంట్ చేసినట్లు అంగీకరించాడు. దీంతో సైబరాబాద్ పోలీసులు నేరానికి ఉపయోగించిన లగ్జరీ కారును సీజ్ చేసి… నిందితుడిపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.