గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా మల్కాజ్ గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. రూ. లక్ష లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
రూ. 1 లక్ష లంచం డిమాండ్….

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్, జాతవత్ బాబు నాయక్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఓ సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా సెక్షన్ 35 BNSS (గతంలో సెక్షన్ 41ఏ Cr.P.C.) కింద నోటీసు ఇచ్చేందుకు రూ. 1,00,000 లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి నుంచి ఈ డబ్బులను తీసుకుంటుండగా ఎల్.బి. నగర్ చౌరస్తా వద్ద పట్టుబడ్డారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు కాగా… విచారణ జరుగుతోందని ఏసీబీ వెల్లడించింది.
ఇక ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.