సింగరేణి కార్మికులకు తీపికబురు - ఈనెల 15న ఖాతాల్లోకి దసరా పండుగ అడ్వాన్స్ డబ్బులు
దసరా పండుగ సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు అందించింది. అర్హులైన ఎన్సీడబ్ల్యూఏ కార్మికులకు రూ.25,000, ట్రెయినీలకు రూ.12,500 అడ్వాన్స్ అక్టోబర్ 15న జమ కానుంది.
దసరా పండుగ వేళ సింగరేణి బొగ్గు గని కార్మికులకు యాజమాన్యం శుభవార్త అందించింది. అక్టోబర్ 20న రానున్న దసరా (విజయదశమి) వేడుకలను పురస్కరించుకుని కార్మికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "దసరా పండుగ అడ్వాన్స్" చెల్లింపునకు సంబంధించి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీ గనులు, వివిధ విభాగాల ప్రతినిధులకు ఈ మేరకు సర్క్యులర్ పంపింది.

ఎంత జమ చేస్తారంటే..?
ఈ నిర్ణయం ప్రకారం, సింగరేణిలో పనిచేస్తున్న అర్హులైన రెగ్యులర్ ఎన్‌సీడబ్ల్యూఏ (NCWA) ఉద్యోగులతో పాటు మైన్స్ యాక్ట్ కింద లీవ్‌కు అర్హత సాధించిన ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున పండుగ అడ్వాన్స్ అందనుంది. అదేవిధంగా…. మైన్స్ యాక్ట్ ప్రకారం ఇంకా లీవ్ అర్హత సాధించని ఇతర తాత్కాలిక కార్మికులు, ట్రెయినీ ఉద్యోగులకు రూ.12,500 చొప్పున అడ్వాన్స్ చెల్లించనున్నారు.
కార్మికులు పండుగ అవసరాలను సమర్థవంతంగా తీర్చుకునేందుకు వీలుగా, అక్టోబర్ 15వ తేదీనే ఈ అడ్వాన్స్ మొత్తాన్ని నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ అడ్వాన్స్ మొత్తాన్ని కార్మికుల నుంచి 10 సమాన వాయిదాలలో రికవరీ చేయనున్నారు. నవంబర్ 2026 నెల జీతాల నుంచి (డిసెంబర్ 2026లో చెల్లించే జీతాలు) ఈ వాయిదాల కోత ప్రారంభమవుతుంది. అయితే పండుగ అడ్వాన్స్ చెల్లింపుల విషయంలో కొన్ని కీలక నిబంధనలను కూడా యాజమాన్యం విధించింది.
అడ్వాన్స్ చెల్లించే నాటికే రిటైర్మెంట్ కాబోతున్న లేదా వైద్యపరంగా అన్‌ఫిట్‌గా ప్రకటించి ఉద్యోగం ముగియనున్న ఉద్యోగులకు ఈ పండుగ అడ్వాన్స్ వర్తించదని పేర్కొంది. ఒకవేళ ఉద్యోగుల సర్వీసు 10 నెలల కంటే తక్కువగా మిగిలి ఉంటే…. వారు రిటైర్ అయ్యే తేదీ కంటే ముందే ఈ అడ్వాన్స్ మొత్తాన్ని పూర్తిగా రికవరీ చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
గత ఏడాది పండుగ అడ్వాన్సు తీసుకుని, దానికి సంబంధించిన బకాయిలను ఇంకా పూర్తిగా చెల్లించని ఉద్యోగులకు పూర్తి స్థాయిలో అడ్వాన్స్ అందదు. పాత బాకీలను మినహాయించిన తర్వాత మిగిలిన బకాయి మొత్తాన్ని మాత్రమే సదరు ఉద్యోగులకు చెల్లిస్తారని… అధికారులు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. పండుగ వేళ అడ్వాన్స్ నగదు జమ కానుండటంతో సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

